Teams With Most Sixes In ODI Cricket: ఇండోర్ వేదికగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత్ 99 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. వర్షం కారణంగా ఆస్ట్రేలియా లక్ష్యాన్ని 33 ఓవర్లలో 317 పరుగులకు సవరించగా.. 28.2 ఓవర్లలో 217 పరుగులకు స్మిత్ సేన ఆలౌట్ అయింది. రెండో వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 5 వికెట్ల నష్టానికి 399 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. సిక్సుల వర్షం కురిపిస్తూ భారత స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. దాంతో భారత్ ఖాతాలో ఓ అరుదైన రికార్డు చేరింది.
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత బ్యాటర్లు మొత్తం 18 సిక్స్‌లు బాదారు. దాంతో వన్డేల్లో 3000కి పైగా సిక్స్‌లు బాదిన తొలి జట్టుగా టీమిండియా రికార్డుల్లో నిలిచింది. వన్డే చరిత్రలో భారత్ 3007 సిక్స్‌లతో కొనసాగుతోంది. ఏ జాబితాలో వెస్టిండీస్ 2953 సిక్స్‌లతో రెండో స్థానంలో ఉంది. పాకిస్తాన్ (2566), ఆస్ట్రేలియా (2476), న్యూజీలాండ్ (2387), ఇంగ్లండ్ (2032), దక్షిణాఫ్రికా (1947), శ్రీలంక (1779)లు వరుస స్థానాల్లో ఉన్నాయి. ఈ జాబితాలో నెదర్లాండ్స్ (307) చివరి స్థానంలో ఉంది.
Also Read: KL Rahul: అది నేను అస్సలు ఊహించలేదు: కేఎల్ రాహుల్
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత బ్యాటర్లు 18 సిక్స్‌లు బాదారు. ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు బాదడం ఇది ఐదోసారి. 2013లో ఆస్ట్రేలియాపైనే 19 సిక్స్‌లు బాదారు. 2023లో కివీస్‌పై 19, 2007లో బెర్ముడాపై 18, 2009లో కివీస్‌పై 18 సిక్స్‌లను భారత బ్యాటర్లు కొట్టారు. భారత్ తరఫున రోహిత్ శర్మ (286), ఎంఎస్ ధోనీ (229), సచిన్ టెండ్యూలర్ (195), సౌరవ్ గంగూలీ (190), యువరాజ్ సింగ్ (155), విరాట్ కోహ్లీ (141)లు అత్యధిక సిక్స్‌లు బాదారు.