India Captain KL Rahul Said Playing 11 is not our hands: ఇండోర్ పిచ్ ఇంత స్పిన్ అవుతుందని తాను అస్సలు ఊహించలేదని టీమిండియా తాత్కాలిక కెప్టెన్ లోకేష్ రాహుల్ అన్నాడు. ప్లేయింగ్ ఎలెవన్ ఎంపిక తమ చేతుల్లో ఉండదని, అవకాశం వచ్చినపుడే నిరూపించుకోవాలన్నాడు. మూడో వన్డే మ్యాచ్‌కు సీనియర్ ఆటగాళ్లు అందుబాటులోకి వస్తారని, జట్టు ఎంపిక గురించి ఇంకా చర్చించలేదు అని రాహుల్ తెలిపాడు. పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో కేఎల్ రాహుల్ మాట్లాడుతూ పలు విషయాలపై స్పందించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
‘ఉదయం పిచ్‌ను పరిశీలించినప్పుడు ఇంత స్పిన్ అవుతుందని అస్సలు అనుకోలేదు. ఆస్ట్రేలియా ముందు 400 పరుగుల లక్ష్యాన్ని పెట్టడం మా అత్మవిశ్వాసన్ని రెట్టింపు చేసింది. తుది జట్టు ఎంపిక మా చేతుల్లో ఉండదు. జట్టులో మా స్థానాలపై మాకు ఒక సృష్టత ఉంది. తుది జట్టులో ఎవరికి చోటు దక్కినా..100 శాతం కష్టపడుతాం. ఎప్పటికప్పుడూ ఆటను మెరుగుపరుచుకుంటూనే.. అవకాశాల కోసం ఎదురు చూడాలి. ప్రతి ఒక్కరూ తమ పనిపై దృష్టి పెట్టాలి. మ్యాచ్‌లో కొన్ని క్యాచ్‌లను జారవిడిచాం. ఫ్లడ్ లైట్‌ల వెలుతురులో ఫీల్డింగ్ చేయడం అంత సులభం కాదు’ అని లోకేష్ రాహుల్ తెలిపాడు.
‘మమ్మల్ని ఫిట్‌గా ఉంచేందుకు కోచ్‌లు తమ వంతు కృషి చేస్తున్నారు. అయితే కొన్నిసార్లు తప్పిదాలు జరుగుతుంటాయి. కానీ మా కమిట్‌మెంట్ మాత్రం ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుంది. తదుపరి మ్యాచ్‌లో తప్పిదాలు జరగకుండా ప్రయత్నిస్తాం. ప్రపంచకప్ 2023కు ఇనక రెండు వారాల సమయం మాత్రమే ఉంది. మూడో వన్డే మ్యాచ్‌కు సీనియర్ ఆటగాళ్లు జట్టులోకి వస్తారు. మూడో వన్డే మ్యాచ్ తుది జట్టు ఎంపిక గురించి ఇంకా చర్చించలేదు’ అని రాహుల్ పేర్కొన్నాడు.
Also Read: Parineeti Chopra-Raghav Chadha: పెళ్లి తర్వాత.. పరిణీతి చోప్రా-రాఘవ్ చద్దా మొదటి ఫోటో!
ఇండోర్ వేదికగా ఆదివారం ఏకపక్షంగా సాగిన రెండో వన్డేలో భారత్ 99 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 5 వికెట్ల నష్టానికి 399 పరుగుల భారీ స్కోరు చేసింది. శ్రేయస్ అయ్యర్ (105; 90 బంతుల్లో 11×4, 3×6), శుభ్‌మన్ గిల్ (104; 97 బంతుల్లో 6×4, 4×6), సూర్యకుమార్ యాదవ్ (72 నాటౌట్; 37 బంతుల్లో 6×4, 6×6) చెలరేగారు. వర్షం కారణంగా ఆస్ట్రేలియా లక్ష్యాన్ని 33 ఓవర్లలో 317 పరుగులకు సవరించగా.. ఆ జట్టు 28.2 ఓవర్లలో 217 పరుగులకు ఆలౌట్ అయింది. సీన్ అబాట్ (54; 36 బంతుల్లో 4×4, 5×6) టాప్ స్కోరర్. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 2-0తో కైవసం చేసుకుంది. ఇక మూడో వన్డే బుధవారం జరుగుతుంది.