మెదక్-నిజామాబాద్-కరీంనగర్-ఆదిలాబాద్ పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తయింది. పట్టభద్రుల స్థానానికి దాఖలైన 100 నామినేషన్లలో 32 తిరస్కరణ అయ్యాయి. మరోవైపుకు టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి దాఖలయిన నామినేషన్లలో ఓ నామినేషన్ తిరస్కరణ అయింది. మెదక్-నిజామాబాద్-కరీంనగర్-ఆదిలాబాద్ పట్టభద్రుల, టీచర్స్ నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల ప్రక్రియలో భాగంగా మంగళవారం నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది.
పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 100 మంది నామినేషన్ వేయగా.. 32 మంది నామినేషన్లు వివిధ కారణాల చేత ఎన్నికల రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. సరైన ఫార్మాట్లో ఉన్న 68 మంది నామినేషన్లు ఆమోదం పొందాయి. ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 17 మంది నామినేషన్లు దాఖలు చేయగా.. ఒకరి నామినేషన్ తిరస్కరణకు గురైంది. 16 మంది నామినేషన్లను ఆమోదించారు. మెదక్-నిజామాబాద్-కరీంనగర్-ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 3 నుండి 10 వరకు నామినేషన్లు స్వీకరించారు. మంగళవారం నామినేషన్ల పరిశీలన కలెక్టరేట్లోని ఆడిటోరియంలో నామినేషన్ వేసిన వారి సమక్షంలో నిర్వహించారు.