NTV Telugu Site icon

Bhatti Vikramarka : భట్టి విక్రమార్కకు టీడీపీ సంపూర్ణ మద్దతు

Bhatti Vikramarka

Bhatti Vikramarka

విలువలతో కూడిన రాజకీయాలు చేసి మధిర ప్రతిష్టను, ఓట్లు వేసి గెలిపించిన ప్రజల గౌరవాన్ని తలెత్తుకునేలా నిలబెట్టిన కాంగ్రెస్ అభ్యర్థి, సీఎల్పీ నేత, మధిర శాసనసభ్యులు భట్టి విక్రమార్క మల్లును ఈ ఎన్నికల్లో గెలిపించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఖమ్మం జిల్లా పార్టీ అధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వేవ్ నడుస్తున్నదని రాబోయే ప్రభుత్వంలో కీలక భూమికగా మారనున్న భట్టి విక్రమార్క వల్ల మధిర నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కావడంతో పాటు ప్రజలకు సంక్షేమం, మరిన్ని ప్రయోజనాలు అందుతాయన్న నమ్మకంతోనే ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సంపూర్ణంగా భట్టి విక్రమార్కకు మద్దతు ప్రకటిస్తున్నదని తెలిపారు. తెలుగుదేశం కాంగ్రెస్, సిపిఐ, వైయస్సార్ టిపి శ్రేణులు సమన్వయంతో కలిసి పని చేసి మధిర అభివృద్ధి కోసం భట్టి విక్రమార్కను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందామని విజ్ఞప్తి చేశారు. మధిర నియోజకవర్గ ప్రజలకు మంచి జరగాలని రాష్ట్ర పార్టీ అనుమతితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ ఎన్నికలు జరగబోయే 15 రోజుల వరకు అవిశ్రాంతంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం కోసం సైనికుల వలె పని చేసి తెలుగుదేశం పార్టీ సత్తాను మరోసారి నిరూపించాలని కోరారు.

నేను మీ బిడ్డనే.. నాలుగో సారి ఆశీర్వదించండి: భట్టి

“పార్టీలు వేరైనా మనందరం కుటుంబ సభ్యులం. నేను మీ బిడ్డనే. మధిర నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి పక్కా ప్రణాళిక తో ముందుకు వెళ్తాను. ఆశీర్వదించి నాలుగో సారి గెలిపించాలని” సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. పాలించే వాడిగా ఉన్న, ప్రశ్నించే వాడిగా ఉన్నా ఏలాంటి రాజకీయ పక్షపాతం లేకుండా నియోజకవర్గ అభివృద్ధి కోసం అందరితో కలిసి పనిచేశానని వివరించారు. తెలుగుదేశం మద్దతుతో మిత్రపక్ష అభ్యర్థిగా గత ఎన్నికల్లో మీరందరూ ఓట్లు వేసి గెలిపించినందునే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనకు శాసనసభ పక్ష నేతగా అవకాశం ఇచ్చిందన్నారు. దేశంలో మోడీ, రాష్ట్రంలో కెసిఆర్ ప్రతిపక్షం లేకుండా, ప్రశ్నించే వాళ్లను జైలుకు పంపి, వాళ్లు మాత్రమే రాజకీయాలు చేయాలని, ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేసిన ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ తనకు మద్దతు ఇవ్వడం అభినందనీయమని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం సమన్వయ సమావేశం వేసుకొని సమిష్టి నిర్ణయాలు తీసుకొని ప్రణాళిక బద్ధంగా కలిసి పనిచేద్దామని అన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం మధ్యన స్నేహబంధం రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా ఉంటుందని వెల్లడించారు. మధిరను రెవిన్యూ డివిజన్ గా మార్చుకోవడంతో పాటు ఔటర్ రింగ్ రోడ్, విద్య, వైద్య సంస్థలు, పరిశ్రమలు, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, టూరిజంను అభివృద్ధి చేయడమే తన ధ్యేయమన్నారు. జిల్లాలోని ప్రోగ్రెసివ్ నాయకులకు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం మంచి నాయకుడని, అలాంటి ఆదర్శప్రాయుడితో కలిసి పనిచేయడం తనకు చాలా సంతోషంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐటిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేమూరి సునీల్, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి రాణి, జిల్లా ఉపాధ్యక్షులు రాంకోటి, జిల్లా నాయకులు మల్లాది హనుమంతరావు చేకూరి శేఖర్ బాబు సామేలు పుల్లారావు కృష్ణారావు వెంకటేశ్వరరావు సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సూరంశెట్టి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.