Guntur: ఎన్నికల వేళ ప్రతిపక్ష టీడీపీకి షాకుల మీదు షాకులు తగులుతున్నాయి. టీడీపీ సీనియర్ నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్నారు. విజయవాడ, గుంటూరులలో కేశినేని, రాయపాటి కుటుంబాలు అండగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ కుటుంబాలు సైకిల్ దిగాయి. గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేత పార్టీకి గుడ్‌బై చెప్పారు. టీడీపీకి రాయపాటి రంగారావు రాజీనామా చేశారు. ఇటీవల విజయవాడ ఎంపీ కేశినేని నాని పార్టీకి రాజీనామా చేయగా.. ఇవాళ రాయపాటి రంగారావు పార్టీకి గుడ్‌బై చెప్పారు. స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పోస్టుతో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు రంగారావు. ఈ మేరకు రాజీనామా లేఖను ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు పంపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీలో పని చేయలేనని స్పష్టం చేశారు రంగారావు. తన నిర్ణయాన్ని గౌరవించాలని లేఖలో కోరారు.
Read Also: CM YS Jagan: ఆరోగ్యశ్రీ ఉచిత సేవలు పొందే విషయంలో ఎవ్వరికీ సందేహాలు ఉండొద్దు.. సీఎం ఆదేశం
రాయపాటి కొంత కాలం నుంచి పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు. రాయపాటి రంగారావు సత్తెనపల్లి అసెంబ్లీ సీటును ఆశించారు. అయితే అక్కడ కన్నా లక్ష్మీనారాయణను నియమించారు. టీడీపీలో ఇమడలేక… నరసరావుపేట పార్లమెంటు స్థానాన్ని కూడా బీసీలకు కేటాయించాలని టీడీపీ నిర్ణయించినట్లు తెలియడంతో రాయపాటి రంగారావు పార్టీ పదవులకు రాజీనామా చేశారు. రాయపాటి సాంబశివరావు కొంతకాలం క్రితం చంద్రబాబును కలసి తమకు రెండు టిక్కెట్లు కావాలని కోరారు. ఒక్కస్థానం కూడా ఇవ్వకపోవడంతో ఆయన కుటుంబం పార్టీకి గుడ్ బై చెప్పింది. ఇదిలా ఉండగా.. అదే బాటలో మరికొందరు సీనియర్ నేతలు నడవనున్నట్లు సమాచారం. సొంత సామాజిక వర్గం నుండి తగులుతున్న షాకులతో టీడీపీ కుదేలవుతుంది. ఎన్నికల సమయంలో ఇది పార్టీకి కోలుకోలేని దెబ్బ అని క్యాడర్ అంటోంది.
ఈ సందర్భంగా రాయపాటి రంగారావు మాట్లాడుతూ..”టీడీపీ ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారింది. నామినేటెడ్ పదవులు డబ్బులు తీసుకుని అమ్ముకునే వాళ్ళు. మా దగ్గర 150 కోట్లు తీసుకుని ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇచ్చారు. రాష్ట్రం విడిపోయిన ప్రత్యేక పరిస్థితుల్లో ఆ రోజు మా నాన్న పోటీ చేయాల్సి వచ్చింది. కులం పేరుతో పార్టీలో ఆధిపత్యం కొనసాగుతుంది. చంద్రబాబు, లోకేష్‌లు నాయకుల వద్ద డబ్బు వసూళ్ల కార్యక్రమం చేస్తున్నారు. అందుకే పార్టీకి దూరం అవుతున్నా. కనీసం పల్నాడు వాటర్ గ్రిడ్‌కు నిధులు ఇవ్వలేక పోయారు. రాష్ట్రంలో చంద్రబాబు చేసిన సంక్షేమం ఏంటో చెప్పాలి. టీడీపీతో మా కుటుంబం తీవ్రంగా నష్టపోయింది. వైసీపీలోకి ఆహ్వానిస్తే వెళ్లి పని చేస్తా. ఏ బాధ్యత ఇచ్చినా పనిచేస్తా. మంగళగిరిలో లోకేష్ ఎలా గెలుస్తారో చూస్తా. మా కుటుంబానికి గుంటూరు, పల్నాడు ప్రాంతాలలో ప్రజల్లో మంచి పేరు ఉంది. నాకు ఎక్కడ నుంచి అవకాశం ఇచ్చినా పోటీ చేస్తా.” అని రాయపాటి అన్నారు.