NTV Telugu Site icon

Galla Jayadev: ఇక రాజకీయాలకు దూరం.. ఎంపీ గల్లా జయదేవ్‌ సంచలన నిర్ణయం

Galla Jayadev

Galla Jayadev

Galla Jayadev: తన రాజకీయ విరామంపై ఎంపీ గల్లా జయదేవ్ క్లారిటీ ఇచ్చారు. గుంటూరులో ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సభ నిర్వహించారు ఎంపీ గల్లా జయదేవ్. తనకు రాజకీయంగా అవకాశం ఇచ్చిన చంద్రబాబుకు రుణపడి ఉంటానని పేర్కొన్నారు. ఎంపీగా రెండు సార్లు గెలిపించిన గుంటూరు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. చివరి మూడు సంవత్సరాలుగా తాను క్షేత్ర స్థాయిలో అందుబాటులో లేనని.. కానీ పార్లమెంట్‌లో గుంటూరు ప్రజలకు ఏం చేయాలో అవి చేస్తూనే ఉన్నానని ఆయన అన్నారు. తాత రాజగోపాల్ నాయుడు వారసత్వంగా ప్రజా సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చానని ఆయన వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో కొన్ని వ్యవస్థలు ఫుల్ టైం, కొన్ని వ్యవస్థలు పార్ట్ టైం పని చేస్తాయన్నారు.

Read Also: Bihar Crisis: ముఖ్యమంత్రి పదవికి నితీష్‌కుమార్‌ రాజీనామా.. నెక్ట్స్ ఏంటంటే..!

పార్లమెంట్‌లో కేవలం 24 శాతమే పూర్తి స్థాయిలో పని చేసే పార్లమెంట్ సభ్యులు ఉన్నారని.. మిగిలిన వారు ఏదో ఒక రంగంలో కొనసాగుతూ రాజకీయాలు చేస్తున్నారని ఆయన అన్నారు. బిజినెస్‌మెన్‌గా తనకు ఉన్న నాలెడ్జ్ ప్రజల కోసం ఉపయోగించాలని అనుకున్నానని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు రాజకీయాల్లోకి వచ్చానన్న గల్లా.. రాజకీయ ప్రస్థానం ప్రారంభించడానికి చంద్రబాబును నాయకుడిగా ఎంచుకున్నానన్నారు. తన ప్రస్థానం గుంటూరు నుంచి ప్రారంభించానని.. తన కుటుంబానికి గుంటూరుకు మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. రాజకీయాలు చేసినంత కాలం గ్రూపు వివాదాలకు దూరంగా ఉన్నానని.. పార్టీ కోసం కష్టపడే వారికి ప్రాధాన్యత ఇచ్చానని గల్లా జయదేవ్ స్పష్టం చేశారు. పదేళ్ల నుండి ప్రత్యేక హోదా కోసం పోరాడుతూనే ఉన్నామని.. కానీ ప్రయోజనం లేదన్నారు. ఏపీ రాజధానిగా అమరావతి అవడానికి తన వంతు కృషి చేశానన్నారు. మన తోటి రాష్ట్రాల రాజధానులు సమాన దూరం ఉండేలా విజయవాడ, గుంటూరు ప్రాంతాల మధ్య రాజధాని ఏర్పాటు చేశామన్నారు.

Read Also: Himanta Biswa Sarma : యాత్రలో రాహుల్ బాడీ డబుల్ ను వాడుతున్నారు.. అస్సాం సీఎం సంచలన వ్యాఖ్య

తాను 2024 ఎన్నికల్లో పోటీ చేయడం లేదని గల్లా జయదేవ్ క్లారిటీ ఇచ్చారు. ఎంపీ గల్లా జయదేవ్‌ మాట్లాడుతూ.. ” క్షేత్ర స్థాయిలో పూర్తి గా అందుబాటులో ఉండటం లేదు. నేను వ్యాపార వేత్తగా రాజకీయ నాయకుడిగా ఉండి ఖాళీగా కూర్చో లేను. పోరాటం చేయకుండా నేను ఉండలేను. కానీ నా వ్యాపారాలు దాని మీద ఆధారపడ్డ వాళ్ళని కూడా నేను చూసుకోవాలి. నా కుటుంబాన్ని కూడా చూసుకోవాలి. అందుకే రాజకీయ విరామం తీసుకుంటున్నాను. అమరావతి ఉద్యమంలో నన్ను కొట్టినా, నా వ్యాపారాలు దెబ్బ తీయాలని చూసినా నేను భయపడలేదు. ప్రజల కోసం పోరాటం చేశాను. ఒక వ్యాపారం చేయాలంటే డెబ్బైకి పైగా అనుమతులు కావాలి. ఆ శాఖలు అన్ని అవన్నీ ప్రభుత్వాల దగ్గర ఉన్న ఆయుధాలు అని నా అభిప్రాయం. వ్యాపారుల మీద ప్రభుత్వాలు కక్ష కట్ట కూడదు. 24 శాతం మంది వ్యాపారులు రాజకీయ వేత్తలుగా ఉన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వ్యాపారులపై కక్ష గడితే ఎలా. దేశం మొత్తం ఇదే పరిస్థితి ఉంది. రాజకీయాలు మా తాతల కాలం నుండి ఇలాగే ఉన్నాయి. అలాంటి రాజకీయాలు మారాలని కోరుకుంటున్నా.” అని ఎంపీ జయదేవ్ అన్నారు.

రాష్ట్రంలోని చిత్తూరులోనే మొత్తం వ్యాపారాలు పెట్టడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి వచ్చిందని ఎంపీ జయదేవ్ పేర్కొన్నారు. అందుకే తెలంగాణ , తమిళనాడుతో పాటు విదేశాలలో కూడా పరిశ్రమలు పెడుతున్నామన్నారు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వానికి భయపడాల్సిన పనిలేదన్నారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని తాను అనుకోలేదన్నారు. మళ్ళీ రాజకీయాల్లోకి వస్తే ఫుల్ టైం రాజకీయ నాయకుడి గా వస్తానని ఆయన స్పష్టం చేశారు. రాముడు, పాండవులు,వనవాసం తర్వాత ఎంత బలంగా వచ్చారో తాను కూడా అంత బలంగా రాజకీయాల్లోకి వస్తానన్నారు.