NTV Telugu Site icon

Ramoji Rao: రామోజీరావు అస్తమయంపై చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి.. లోకేష్‌ సహా టీడీపీ నేతల సంతాపం..

Babu

Babu

Ramoji Rao: ఈనాడు గ్రూప్‌ సంస్థల అధినేత, మీడియా మొఘల్, పద్మవిభూషణ్ రామోజీరావు అస్తమయంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. రామోజీరావు తెలుగు వెలుగు. రామోజీ మృతి తీరని లోటు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన రామోజీ అసామాన్య విజయాలు సాధించారు. రామోజీరావు మరణం తనను తీవ్ర ఆవేదనకు గురి చేసింది. అక్షర యోధుడుగా పేరున్న రామోజీ తెలుగు రాష్ట్రాలకు, దేశానికి ఎన్నో సేవలందించారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన తిరిగి కోలుకుంటారని భావించాను. ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదు అని తీవ్ర ఆవేదిన వ్యక్తం చేశారు చంద్రబాబు..

తెలుగు వారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్ర వేశారు రామోజీరావు అని పేర్కొన్నారు చంద్రబాబు.. సమాజ హితం కోసం అనుక్షణం పని చేసిన రామోజీ కీర్తి అజరామరం. ఈనాడు గ్రూపు సంస్థల స్థాపనతో వేల మందికి ఉపాధి కల్పించారని అన్నారు. మీడియా రంగంలో శ్రీ రామోజీది ప్రత్యేకమైన శకం. ఎన్నో సవాళ్లను, సమస్యలను అధిగమించి.. ఎక్కడా తలవంచకుండా విలువలతో రామోజీ తన సంస్థలను నడిపారు. రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు తన ప్రకటనలో పేర్కొన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.

ఇక, రామోజీరావు మృతికి నారా లోకేష్ సంతాపం వ్యక్తం చేశారు.. రామోజీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన లోకేష్. రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు మృతి తెలుగు సమాజానికి తీరని లోటు అన్నారు. ప్రజా పక్షపాతి, అలుపెరుగని అక్షర యోధుడికి కన్నీటి నివాళులు. జనహితమే తన అభిమతంగా జీవితాంతం నిబద్ధతతో రామోజీ పని చేశారు. రామోజీరావు మనకు మార్గదర్శి. ప్రజాస్వామ్య పరిరక్షణకు రామోజీరావు ఉద్యమస్ఫూర్తితో పని చేశారు అని పేర్కొన్నారు నారా లోకేష్‌. మరోవైపు.. రామోజీరావు మృతికి యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడు, సోమిరెడ్డి, కేశినేని చిన్ని, పయ్యావుల, కాల్వ శ్రీనివాసులు, నక్కా ఆనందబాబు సహా పలువురు టీడీపీ నేతలు సంతాపం ప్రకటించారు. మీడియా దిగ్గజం రామోజీరావు మృతి పట్ల సంతాపం తెలిపిన ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్.. తెలుగు రాష్ట్రాలలో సినీ, మీడియా రంగంలో ఎంతోమందికి ఆయన ఆదర్శం.. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన రామోజీ రావు కఠోర సాధనతో ఎన్నో అద్భుతాలు సృష్టించారు.. ఆయన లేని లోటు సమాజానికి తీరనిది అని పేర్కొన్నారు.