పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ ట్వీట్ వ్యవహారం వివాదంగా మారింది. ‘కష్టపడి సాధించే విజయానికి గౌరవం’ అంటూ ట్వీట్ చేసిన వర్మ.. కాసేపటికే డిలీట్ చేశారు. పిఠాపురం ఎన్నికల ప్రచారంలో వర్మ జనసేన జెండాలతో ప్రచారం చేసిన వీడియో షేర్ చేశారు. అయితే ఇందులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడా కనిపించలేదు. కేవలం పవన్ గెలుపు కోసం వర్మ చేసిన ప్రచారం మాత్రమే ఉంది. అయితే వర్మ కాసేపటికి ట్వీట్ డిలీట్ చేశారు.
సోషల్ ప్లానెట్ సంస్థ తన సోషల్ మీడియా అకౌంట్స్ మెయింటైన్ చేస్తుందంటూ ఎక్స్‌లో ఎస్వీఎస్ఎన్ వర్మ పోస్ట్ చేశారు. సోషల్ మీడియా వీడియోకు, తనకు ఎటువంటి సంబంధం లేదని వివరణ ఇచ్చారు. తన పర్మిషన్ లేకుండా తప్పుడు వార్తలు పోస్ట్ చేస్తే తగు చర్యలు తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు వర్మ పర్మిషన్ లేకుండా ట్వీట్ చేశామని సోషల్ ప్లానెట్ సంస్థ ప్రతినిధులు వివరణ ఇచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి.. ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే. అయితే పవన్ చివరి నిమిషంలో పిఠాపురం సీటు ఎంచుకోవడంతో.. అక్కడ పోటీకి సిద్ధమైన టీడీపీ సీనియర్ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ తప్పుకోవాల్సి వచ్చింది. అంతేకాదు పవన్ గెలుపు కోసం పని కూడా చేయాల్సి వచ్చింది.