తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు (Nidadavole) మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు (Burugupalli Sesha Rao) ఇంటిని నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ముట్టడించారు. నిడదవోలు నియోజకవర్గం అసెంబ్లీ స్థానాన్ని తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా బూరుగుపల్లి శేషారావుకు కేటాయించాలని డిమాండ్ చేశారు.
తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నిడదవోలు మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు ఇంటిని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ముట్టడించారు. నియోజకవర్గంలోని నలుమూలల నుంచి నాయకులు, కార్యకర్తలు ఉండ్రాజవరం మండలం వేలివెన్ను లోని ఆయన ఇంటికి చేరుకుని ముట్టడించారు. తొలుత గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పార్టీ శ్రేణులు గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీగా వెళ్లి శేషారావు ఇంటిని ముట్టడించారు. శేషారావు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.
మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ ఎవరెవరో ఏదో ప్రకటనలు చేయడం వల్ల ఇటువంటి సమస్య ఏర్పడిందని అన్నారు. కందుల దుర్గేష్ మొదట రాజమండ్రి రూరల్‌లో పోటీ చేయమన్నారని ఆయన ప్రకటించారు తప్పా అధిష్టానం నాయకులు ఎవరో ప్రకటించలేదని చెప్పారు. తర్వాత అదే కందుల దుర్గేష్ నిడదవోలు వెళ్లమంటున్నారు అని ప్రకటించారన్నారు. చంద్రబాబుగాని పవన్ కళ్యాణ్ గాని ఏ స్థానంలో ఎవరు పోటీ చేస్తే గెలుస్తారో వారికే సీట్లు కేటాయిస్తారన్నారు. నిడదవోలు సీటు విషయంలో కూడా అదే జరుగుతుందని అందువల్ల పార్టీ నాయకులు కార్యకర్తలు బాధపడవద్దని సూచించారు.