జగన్ (CM Jagan) పులివెందుల రాజకీయాలు, పంచాయితీలు చేస్తే కుర్చీ మడతపెట్టి ఇంటికి పంపిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) హెచ్చరించారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లిలో ఏర్పాటు చేసిన ‘రా.. కదలిరా’ సభలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయనకు చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు.
ఓడిపోవడానికి జగన్ సిద్ధంగా ఉన్నారని.. జగన్ సీట్లు ఇస్తానంటే కూడా వద్దని నాయకులు రాజీనామాలు చేస్తున్నారని తెలిపారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వైసీపీ నుంచి వెళ్లిపోతున్నారని చెప్పుకొచ్చారు. పల్నాడును అభివృద్ధి చేసే బాధ్యత టీడీపీ-జనసేనల ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.
‘‘పల్నాడులో వైసీపీ ప్రభుత్వం చేసిన ఒక్క పనైనా చెప్పాలి. రోడ్లు వేశారా, నీళ్లిచ్చారా? లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేశారా? ఏం చేశారో చెప్పాలి. పల్నాడుకి వస్తే తన మనసు ఆవేదనతో నిండిపోతుంది. పల్నాడులో టీడీపీ కార్యకర్తల ప్రాణాలు తీశారు. స్పీకర్‌గా పని చేసిన కోడెల శివప్రసాద్‌ను మానసికంగా వేధించి ప్రాణాలు తీశారు. ఒక చంద్రయ్య , ఒక జల్లయ్య లాంటి కార్యకర్తల మరణాలను, హత్యలను నేను ఎప్పటికీ మర్చిపోను. రెంటచింతల మండలం మల్లవరంలో ఓ ఎస్టీ మహిళ మంచినీళ్లు అడిగితే టాంకర్‌తో గుద్ది చంపేశారు. ఇలాంటి హత్యలు మర్చిపోతానా..?, ప్రజల ప్రాణాలు పోతుంటే విజ్ఞత లేకుండా.. విచారణ చేయకుండా పాలన చేస్తున్న ముఖ్యమంత్రికి పాలించే హక్కు లేదు. పల్నాడులో నరహంతకుల్ని అణగ దొక్కుతాను అదే నా శపధం. వాళ్లను వదిలేది లేదు. పల్నాడులో ముప్పై మంది ప్రాణాలు తీశారు. వాళ్ళని ఉపేక్షించేది లేదు.’’ అని చంద్రబాబు హెచ్చరించారు.
‘‘టీడీపీ అధికారంలోకి వస్తే వైసీపీ నాయకులు ఇల్లు వదలి పారిపోవాలి. పల్నాడు పరిరక్షణ కోసం ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలి. పిరికితనంతో ప్రతిరోజు చనిపోవడం కంటే వీరోచితంగా పోరాడాలి. నన్ను బయటకు రానివ్వకుండా… నా ఇంటికి తాళాలు వేసినప్పుడే చెప్పా. ఆ తాళాలు జగన్‌కు ఉరితాడుగా మారిపోతున్నాయి.’’ అని వ్యాఖ్యానించారు.
‘‘ఓ నాయకుడు నెల్లూరులో ఒక తన్ను తంతే నాలుగు జిల్లాలు దాటి నరసరావుపేట వచ్చి పడ్డాడు. నరసరావుపేటలో తంతే చెన్నై వెళ్లి పడాలి. అక్కడి నుంచి వచ్చిన నాయకుడికి బుల్లెట్ దిగాలి. జగన్‌కు చావు తెలివితేటలు ఎక్కువై ప్రత్తిపాటి పుల్లారావు కొడుకు శరత్‌ను అరెస్టు చేయించారు. జగన్ చేసిన నేరాలకు శాశ్వతంగా జైలు శిక్ష పడాలి.’’ అని చెప్పుకొచ్చారు.
‘‘పల్నాడులో మహిళలు రాణి రుద్రమదేవిలా మేము సైతం యుద్ధానికి సై అంటూ ముందుకు వచ్చారు. టీడీపీ- జనసేనల విజయాన్ని ఎవరు ఆపలేరు. మా విజయాన్ని ఆపాలని చూస్తే తొక్కుకుంటూ ముందుకు వెళ్తాం. ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాస్ రెడ్డి కూడా టీడీపీలోకి వస్తున్నారు. దుర్మార్గ పాలన అంతం చేయడానికి ప్రజల సిద్ధంగా ఉన్నారు. అభివృద్ధి చేయలేక ప్రతిపక్షాల మీద దాడులు చేయిపిస్తున్నారు. ప్రతిపక్ష నాయకులను తిడితేనే పార్టీలో పదవులు ఉంటాయని వైసీపీ చెబుతోంది.’’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు.