Tamilnadu Rains: తమిళనాడులో వర్ష బీభత్సం కొనసాగుతూనే ఉంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు జనాలు తల్లాడిపోతున్నారు. ఈశాన్య రుతుపవనాలు, బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో నాన్ స్టాప్ గా వానలు పడుతూనే ఉన్నాయి. దీంతో నాగపట్నం, తిరువారూర్, మైలదుతురై, తంజావూరు జిల్లాల్లో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కావేరీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద దాటికి నదీ పరీవాహక ప్రాంతాలు నీటమునిగాయి. ఈరోడ్ నుంచి కర్ణాటకకి వెళ్లే ప్రధాన రహదారిపై భారీగా వరద చేరింది. దీంతో ఈరోడ్, ధర్మపురి, సేలం జిల్లాలో రాకపోకలు నిలిచిపోయాయి. మెట్టూరు డ్యామ్‌కి రెండు లక్షల క్యూసెక్కుల వరద నీరు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. డ్యామ్ పూర్తి స్థాయి అవుట్ ఫ్లో కెపాసిటీ 2 లక్షల క్యూసెక్కులు. కానీ కెపాసిటీకి మించి వరద వచ్చే అవకాశం ఉండటంతో.. టెన్షన్ మొదలైంది. ప్రస్తుతానికైతే వచ్చిన నీటిని వచ్చినట్టే దిగువకు వదులుతున్నారు. కందన్‌నగర్, కావేరినగర్, అందియూర్ ప్రాంతాల్లో అధికారులు అలెర్టయ్యారు.
Read Also: Tesla Pi Phone: అదిరిపోయే ఫీచర్స్‌తో మార్కెట్లోకి టెస్లా స్మార్ట్‌ఫోన్.. లాంచింగ్ ఎప్పుడంటే..?
మెట్టూరు డ్యామ్ పరివాహక ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు అందిస్తున్నాయి. మరోవైపు యుద్ధ ప్రాతిపదికన వరద సహాయక చర్యల్ని తీసుకోవాలని తమిళనాడు సీఎం స్టాలిన్ అధికారులను ఆదేశించారు. నది పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్నారు. పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అటవీ ప్రాంతాల్లో భారీ వృక్షాలు విరిగి పడ్డాయి. సత్యమంగళం అటవీప్రాంతాల్లో గ్రామాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఆందియూర్ నుంచి బర్గూరుకు వెళ్ళే రహదారిలోనూ కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో చెన్నై – బెంగుళూరు ప్రాంతాల మధ్య వాహనాల రాకపోకలు స్తంభించాయి. అలాగే, కొండ దిగువ ప్రాంతంలోని దాదాపు 30కి పైగా కొండ గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. మరో రెండు రోజులపాటు వానలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తమిళనాడు ప్రజలను హెచ్చరించింది.