తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో సంచలనం సృష్టించిన పాము కాటు మరణ కేసు చివరకు హత్యగా వెలుగులోకి వచ్చింది. మొదట ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా భావించిన ఈ ఘటనలో, బాధితుడి సొంత కుమారులే భారీ జీవిత బీమా మొత్తాన్ని పొందాలనే ఉద్దేశంతో తమ తండ్రిని హత్య చేశారనే ఆరోపణలు వచ్చాయి. బీమా కంపెనీ పలు అనుమానాలు వ్యక్తం చేయడంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. పోతాతుర్‌పేటై గ్రామానికి చెందిన ప్రభుత్వ పాఠశాల ల్యాబ్ అసిస్టెంట్ 56 ఏళ్ల ఈ.పి. గణేషన్ అక్టోబర్ నెలలో తన నివాసంలో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఆయన పాము కాటుతో మరణించారని ఫిర్యాదు చేయడంతో, పోలీసులు మొదట దీనిని ప్రమాదవశాత్తు మరణంగా కేసు నమోదు చేశారు.
అయితే, గణేషన్ మరణానంతరం బీమా క్లెయిమ్‌లను పరిశీలిస్తున్న సమయంలో ఒక బీమా సంస్థ అనుమానాలు వ్యక్తం చేసింది. గణేషన్ పేరుపై తీసుకున్న బహుళ అధిక విలువ గల జీవిత బీమా పాలసీలు, అలాగే లబ్ధిదారుల ప్రవర్తనపై సంస్థ సందేహాలు లేవనెత్తింది. ఈ విషయాన్ని నార్త్ జోన్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అస్రా గార్గ్ దృష్టికి తీసుకెళ్లడంతో ప్రత్యేక దర్యాప్తు బృందం ద్వారా లోతైన విచారణ ప్రారంభమైంది.
గణేషన్ కుమారులు తమ తండ్రి పేరుపై దాదాపు మూడు కోట్ల రూపాయల విలువైన జీవిత బీమా పాలసీలు తీసుకున్నారని తిరువళ్లూరు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ వివేకానంద శుక్లా తెలిపారు. ఈ భారీ మొత్తాన్ని పొందడానికే వారు పథకం రూపొందించినట్లు దర్యాప్తులో తేలిందన్నరాయన.
కుమారులు తమ తండ్రి మరణాన్ని పాము కాటు ప్రమాదంగా చిత్రీకరించేందుకు కుట్ర పన్నారని అధికారులు వెల్లడించారు. మరణానికి వారం రోజుల ముందు ఒక నాగుపాముతో గణేషన్ కాలి మీద కాటు వేయించారు. అయితే ఆ ప్రయత్నం విఫలమైంది. చివరకు వారు మరో విధంగా హత్యను అమలు చేసి, దాన్ని ప్రమాదవశాత్తు పాము కాటు మరణంగా చూపించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు.