ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు తమిళనాడు మంత్రి శేఖర్ బాబు సవాల్ విసిరారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నై నుంచి పోటీ చేసే దమ్ముందా? అని పవన్‌ను ప్రశ్నించారు. చెన్నైలోని ఏ నియోజకవర్గం నుంచైనా పోటీ చేయొచ్చని, తమిళనాడు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలిచి చూపించాలని ఛాలెంజ్ విసిరారు. ఒకవేళ తమిళనాడు ఎన్నికల్లో పవన్ గెలిస్తే.. ఎన్ని చెప్పినా వినడానికి తాను సిద్ధంగా ఉన్నానని మంత్రి శేఖర్ బాబు తెలిపారు. జనసేనాని తాజాగా మధురైలో డీఎంకేపై చేసిన విమర్శలపై మంత్రి శేఖర్ బాబు ఘాటుగా స్పందించారు.
‘2026 ఎన్నికల్లో చెన్నై నుంచి పోటీ చేసే దమ్ము పవన్ కళ్యాణ్‌కు ఉందా?. చెన్నైలోని ఏ నియోజకవర్గం నుంచైనా పోటీ చేసుకోవచ్చు. తమిళనాడు ఎన్నికల్లో పవన్ గెలిచి చూపించాలి. గెలిచిన తర్వాత మీరు ఎన్ని చెప్పినా వినడానికి నేను సిద్ధం. అసలు తమిళనాడుతో పవన్‌కు ఏం సంబంధం ఉంది?. మమ్మల్ని ప్రశ్నించడానికి పవన్ కల్యాణ్ ఎవరు?. బీజేపీ మాయలో మత రాజకీయాలను ప్రోత్సహించవద్దు. దేవదాయశాఖ అభివృద్ధికి మేం కట్టుబడి ఉన్నాం. పవన్ కళ్యాణ్ మాటలు నమ్మడానికి తమిళ ప్రజలు సిద్దంగా లేరు’ అని తమిళనాడు మంత్రి శేఖర్ బాబు పేర్కొన్నారు.
Also Read: Kesineni Chinni: మాస్టర్ ప్లాన్ రెడీ.. వచ్చే 40 ఏళ్ల అవసరాలకు తగ్గట్టు దుర్గగుడి అభివృద్ధి!
తాజాగా తమిళనాడు పర్యటనకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెళ్లిన విషయం తెలిసిందే. మధురైలో మురుగన్ భక్తుల సదస్సుకు పవన్ హాజరయ్యారు. సభలో మాట్లాడుతూ తమిళనాడు అధికార పార్టీ డీఎంకేపై విమర్శలు చేశారు. మురుగన్ భక్తుల సదస్సుకు సంబంధం లేకపోయినా.. డీఎంకేపై విమర్శలకు దిగారు. సనాతన ధర్మంపై డీఎంకే మంత్రి, నటుడు ఉదయనిధి స్ధాలిన్ గతంలో చేసిన వ్యాఖ్యలపై పరోక్షంగా ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. నేడు మంత్రి శేఖర్ బాబు పవన్ కల్యాణ్‌కు సవాల్ విసిరారు.
