తమిళ డైరెక్టర్ జి.మోహన్ అరెస్ట్ అయ్యారు. తమిళనాడులోని పళని ఆలయంలో వడ్డించే పంచామృతంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గాను మంగళవారం ఉదయం చెన్నై రాయపురంలోని ఆయన నివాసంలో తిరుచ్చి సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. డైరెక్టర్ మోహన్‌ను పోలీసులు తిరుచ్చికి తరలించారు. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండానే మోహన్‌ను అరెస్ట్ చేశారని చెన్నై బీజేపీ అధ్యక్షుడు అంటున్నారు.
పళని ఆలయం ప్రసాదంపై డైరెక్టర్ జి.మోహన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఓ వీడియోలో మాట్లాడుతూ.. పళని పంచామృతంలో గర్భనిరోధక మాత్రలు కలపండి అని అన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ఆయనపై కేసు నమోదు చేసింది. మంగళవారం ఉదయం చెన్నై రాయపురంలోని ఆయన నివాసంలో పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టుకు కారణం ఏమిటి, కేసు ఏంటి అనేదాని గురించి కుటుంబానికి అధికారిక సమాచారం ఇవ్వలేదని.. ఇది సుప్రీం కోర్టు ఆదేశానికి విరుద్ధం అని చెన్నై బీజేపీ అధ్యక్షుడు ఎక్స్‌లో పేర్కొన్నారు.
Also Read: MS Dhoni: సరిగ్గా ఇదే రోజు.. టీమిండియాకు వెరీ స్పెషల్ డే!
తమిళ్ ఇండస్ట్రీలో జి.మోహన్ ప్రముఖ చిత్రనిర్మాత. 2016లో పజయ వన్నారపట్టైతో దర్శకుడిగా కెరీర్‌ను ప్రారంభించారు. ద్రౌపతి, రుద్ర తాండవం, బకాసురన్ వంటి చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఇటీవల డైరెక్టర్ సెల్వరాఘవన్ కథానాయకుడిగా మోహన్ దర్శకత్వంలో వచ్చిన బకాసురన్‌కు మిశ్రమ స్పందన దక్కింది. ద్రౌపతి చిత్రం మొదట వివాదాస్పదంగా మారినా.. బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది.