Tamballapalle MLA: చావడానికైనా, చంపడానికైనా సిద్ధం.. తంబళ్లపల్లె ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!

  • కార్యకర్తల పేరిట అడ్డగోలుగా రిజిస్ట్రేషన్లు
  • మల్లయ్య కొండ, సాధు కొండల్లో మైనింగ్ జోలికి రావొద్దు
  • ఈ నెల 12 వరకు ప్రతి మండల కేంద్రంలో నిరసన కార్యక్రమాలు
Peddireddy Dwarakanatha Reddy

Peddireddy Dwarakanatha Reddy

తంబళ్లపల్లె నియోజకవర్గంలోని మల్లయ్య కొండ, సాధు కొండల్లో మైనింగ్ జోలికొస్తే.. చావడానికైనా, చంపడానికైనా సిద్ధమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారక నాధ్ రెడ్డి. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రేపటి నుంచి ఈ నెల 12వ తేదీ వరకు ప్రతి మండల కేంద్రంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తంబళ్లపల్లి పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన మల్లయ్య కొండ, సాధు కొండలపై మైనింగ్ మాఫియా కన్ను పడిందని ఎమ్మెల్యే ఆరోపించారు. ఆధ్యాత్మిక కేంద్రాలను మైనింగ్ పేరిట ధ్వంసం చేయాలని చూస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. వాటి జోలికి వస్తే చావడానికైనా, చంపడానికైనా తాము సిద్ధంగా ఉన్నామని సంచలన వ్యాఖ్యలు చేశారు.

పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా ప్రజలంతా కలిసికట్టుగా వచ్చి ఈ మైనింగ్ దోపిడీని అడ్డుకోవాలని.. కూటమి నాయకులు సహకరించకపోయినా ఈ ప్రజా ఉద్యమం ఆగే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారక నాధ్ రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయ కక్షతోనే తమపై బురదజల్లుతున్నారని, మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసు జరిగి రెండు సంవత్సరాలు కావస్తున్నా ఎందుకు సీబీఐ విచారణ జరిపించలేకపోయారని కూటమి సర్కార్‌ను డిమాండ్ చేశారు. తాము తప్పు చేసినట్లు నిరూపించే దమ్ము ప్రభుత్వానికి ఉందా? అని తంబళ్లపల్లె ఎమ్మెల్యే ప్రశ్నించారు.

×
×
Ad

ప్రస్తుత ప్రభుత్వంలో అధికారులను అడ్డం పెట్టుకుని, విలువైన 22A భూములను కూటమి కార్యకర్తల పేరిట అడ్డగోలుగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారక నాధ్ రెడ్డి ఆరోపించారు. రాబోయే రోజుల్లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాగానే ఈ భూదోపిడీ మొత్తం బయటకు తీసి, క్షేత్రస్థాయిలో కఠిన విచారణ జరిపిస్తామని హెచ్చరించారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని, దమ్ముంటే సీఎం చంద్రబాబు కానీ, మంత్రి నారా లోకేష్ కానీ తంబళ్లపల్లి నియోజకవర్గంలో తనపై పోటీ చేసి గెలవాలని ఓపెన్ ఛాలెంజ్ విసిరారు.