Suryakumar Yadav Injury: బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. టెస్టుల్లో పునరాగమనమే లక్ష్యంగా బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నమెంట్ బరిలోకి దిగిన సూర్య గాయం బారిన పడ్డాడు. శుక్రవారం తమిళనాడుతో మ్యాచ్ సందర్భంగా అతడి చేతికి గాయమైంది. దాంతో దులిప్ ట్రోఫీకి మిస్టర్ 360 దూరమయ్యే అవకాశం ఉంది. బంగ్లాతో టెస్టు సిరీస్ సమయానికి సూర్య అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.
2023 ఫిబ్రవరిలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ద్వారా సూర్యకుమార్ యాదవ్ భారత్ తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. సొంతగడ్డపై జరిగిన ఈ సిరీస్‌లో కేవలం 8 పరుగులు మాత్రమే చేశాడు. ఆపై అతడికి మళ్లీ టెస్టు జట్టులో స్థానం దక్కలేదు. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగే టెస్టు సిరీస్ ద్వారా రీఎంట్రీ ఇవ్వాలని భావించిన సూర్య.. ముంబై తరఫున బుచ్చిబాబు టోర్నీలో బరిలోకి దిగాడు. తమిళనాడు మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 30 పరుగులు చేసిన సూర్య.. అనంతరం ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. దాంతో ఇప్పుడు దులిప్ ట్రోఫీలో పాల్గొనడంపై సందిగ్దం నెలకొంది.
సూర్యకుమార్ యాదవ్ గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే.. అతడి టెస్టు రీఎంట్రీ కల ఇప్పట్లో కష్టమే. సూర్య ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యినట్లు ఉంది. సెప్టెంబరు 19 నుంచి బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. దులిప్ ట్రోఫీ ప్రదర్శన ఆధారంగా బీసీసీఐ సెలెక్టర్లు కొంతమందిని ఎంపిక చేయనున్నారు. సీనియర్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు దులిప్ ట్రోఫీ ఆడకుండా విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే.