Suryakumar Yadav: టీ20 జాతీయ జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇటీవల తన శరీరంలో ఏర్పడిన స్పోర్ట్స్ హెర్నియా సమస్యతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన లండన్‌కి చేరుకున్నాడు. అక్కడ ఓ స్పెషలిస్ట్ వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకుంటున్నారు. అవసరమైతే శస్త్రచికిత్స చేయాల్సి రావచ్చని సమాచారం. 34 ఏళ్ల సూర్యకుమార్ యాదవ్‌కి కుడి వైపు కడుపు దిగువ భాగంలో హెర్నియా సమస్య ఏర్పడినట్టు సమాచారం. ఈ సమస్య వల్ల అతను కొంతకాలంగా అసౌకర్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని లండన్‌లో ఉన్న స్పెషలిస్ట్‌ని సంప్రదించేందుకు అక్కడికి వెళ్లాడు.
Read Also: Hyderabad: డబల్ బెడ్‌రూమ్‌లు ఇప్పిస్తామని మోసం.. పేదల నుంచి భారీగా వసూళ్లు..!
ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ తరఫున అత్యద్భుత ప్రదర్శనతో 700 పరుగులు చేసి మరోసారి తన ఫామ్ ను చాటిన సూర్యకుమార్, ఆ తరువాత ముంబై టీ20 లీగ్‌లో కూడా పాల్గొన్నారు. ఈ బిజీ క్రికెట్ షెడ్యూల్ తర్వాత ప్రస్తుతం అంతర్జాతీయ టీ20 షెడ్యూల్ లేకపోవడంతో తన ఆరోగ్యాన్ని మెరుగుపరచుకునే అవకాశంగా తీసుకున్నాడు. భారత జట్టుకు వచ్చే టీ20 సిరీస్ ఆగస్ట్‌లో బంగ్లాదేశ్‌తో జరగనుంది. ఈ సమయంలో పూర్తిగా కోలుకునే అవకాశముందని భావిస్తున్నారు. అయితే, శస్త్రచికిత్స అవసరమైతే కోలుకునే ప్రక్రియ మరింత సమయం తీసుకోవచ్చని బీసీసీఐ వర్గాలు తెలియజేశాయి.
ఒకవేళ సర్జరీ జరిగితే చికిత్స అనంతరం, బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ లో రికవరీ, ఫిట్‌నెస్ ట్రైనింగ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే భారత టెస్ట్ జట్టు ఇంగ్లాండ్‌లో ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం సిద్ధమవుతోంది. జూన్ 20న తొలి టెస్ట్ హెడింగ్లీలో ప్రారంభం కానుంది. కానీ, సూర్యకుమార్ టెస్ట్ ఫార్మాట్‌లో లేనందున ఈ సమయంలో అతను తన ఆరోగ్యం పట్ల దృష్టి సారించేందుకు ఇది మంచి అవకాశం అవుతుంది.