ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పోలవరం ప్రాజెక్ట్ ముంపు ప్రాంతాల గుర్తించేందుకు ఏపీ, తెలంగాణకు చెందిన ఇంజనీర్ల బృందం నేడు ఉమ్మడి సర్వే నిర్వహించనుంది. ఏపీకి చెందిన జలవనరుల పర్యవేక్షక ఇంజనీర్, తెలంగాణ నీటిపారుదల శాఖకు చెందిన పర్యవేక్షక ఇంజినీర్‌ల నేతృత్వంలో తెలుగు రాష్ట్రాల నుంచి 6 మంది సభ్యులున్న బృందాలు ఈ సర్వేలో పాల్గొననున్నాయి. అయితే.. పోలవరం ప్రాజెక్ట్ పూర్తిగా నిండితే బ్యాక్ వాటర్ ప్రభావంతో తమ పంట పొలాలు, నివాసాలు ముంపుకు గురవుతాయని తెలంగాణ సర్కార్ ఇప్పటికే వెల్లడించింది.
Also Read :Telangana: తాగుబోతుల్లో మనమే తోపు.. తగ్గేదె లే అంటున్న పోరగాళ్లు
అయితే.. దీంతోపాటు జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ మరోమారు ముంపు ప్రాంతాల్లో సర్వే చేపట్టాలని నిర్ణయించింది. ప్రాజెక్టులో జలాశయం పూర్తిస్థాయి మట్టానికి నీటిని నిల్వ చేస్తే 891 ఎకరాల పంట భూములు మునుగుతాయని, స్థానికంగా నదిలో కలిసే వాగుల ప్రవాహం వెనక్కు వస్తుందని పోలవరం ప్రాజెక్టు అథారిటీకి తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. దీన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరింది. గురువారం క్షేత్రస్థాయిలో నిర్వహించనున్న సర్వే అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల ఇంజినీర్లు సమావేశమవుతారని తెలుస్తోంది. ఈ సర్వేను ఒక్క రోజుతోనే ముగిస్తారా లేక మరికొన్ని రోజులు చేపడతారా అన్న అంశంపై ఎలాంటి క్లారిటీ లేదు.
ఈ ఏడాది గోదావరికి వచ్చిన భారీ వరదల సమయంలో పోలవరం ప్రాజెక్టు వద్ద నీటి నిల్వ కారణంగా బ్యాక్ వాటర్ ఒత్తిడి పెరిగి ఏర్పడిన భారీ ముంపుపైనా సర్వే చేయాలని తెలంగాణ నీటిపారుదల శాఖ పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులను కోరనున్నట్లు సమాచారం. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భదాద్రి పరిసర ప్రాంతాలు తీవ్ర ముంపుకు గురయ్యాయి. పోలవరం ప్రాజెక్టు మార్పుల వల్లే మాప్రాంతాలు ముంపుకు గురయ్యాయని స్థానికులు ఆరోపించారు.