టీ20ల్లో అదరగొడుతున్న మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి.. ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో అరంగేట్రం చేశాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ స్థానంలో వరుణ్‌కు అవకాశం దక్కింది. తన 10 ఓవర్ల స్పెల్‌లో 54 పరుగులు ఇచ్చి.. ఓ వికెట్ తీశాడు. టాప్ బ్యాటర్లను సైతం ఇబ్బందిపెడుతున్న వరుణ్‌కు ఛాంపియన్స్ ట్రోఫీ 2025లోనూ అవకాశం దక్కనుందని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. దీనిపై టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా స్పందించాడు. ఎంతో అనుభవం కలిగిన కుల్దీప్‌ను ఐసీసీ టోర్నీలో పక్కన పెట్టొద్దని సూచించాడు.
స్టార్ స్పోర్ట్స్‌లో సురేష్ రైనా మాట్లాడుతూ… ‘టీ20లలో వరుణ్ చక్రవర్తి బాగా బౌలింగ్ చేస్తున్నాడు. అతడు టీ20లకు సరిగ్గా సరిపోయే బౌలర్. కుల్దీప్ యాదవ్ విభిన్నమైన బౌలర్. కుల్దీప్‌కు వైవిధ్యం మరియు వికెట్లు తీసే సామర్థ్యం ఉంది. మరీ ముఖ్యంగా మందకొడి పిచ్‌లపై వికెట్లు తీయగల సత్తా ఉన్నోడు. ఐసీసీ టోర్నీల్లో అద్భుతమైన ప్రదర్శన చేస్తాడు. 2019 వన్డే ప్రపంచకప్‌లో పాకిస్తాన్ బ్యాటర్ బాబర్ అజామ్‌ను క్లీన్‌బౌల్డ్ చేయడం ఇప్పటికీ నాకు గుర్తుంది. అతడి చేతిలో ఏదో అద్భుత నైపుణ్యం ఉంది. కుల్దీప్‌కు పెద్ద మ్యాచులు ఆడిన అనుభవం ఉంది. అలంటి వాడిని ఐసీసీ టోర్నీలో పక్కన పెట్టొద్దు’ అని చెప్పాడు.
Also Read: Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా కోసం బీసీసీఐ వెయిటింగ్!
ఇంగ్లండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 జట్టులో కుల్దీప్ యాదవ్ భారత జట్టులో భాగంగా ఉన్నాడు. నాగ్‌పూర్‌లో జరిగిన మొదటి వన్డేలో ఈ ఎడమచేతి వాటం స్పిన్నర్ 9.4 ఓవర్లలో 53 రన్స్ ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. అంతకుముందు ఆగస్టు 2024లో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో మూడు మ్యాచ్‌లలో నాలుగు వికెట్లు తీశాడు. మరోవైపు మరోవైపు వరుణ్ చక్రవర్తి అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చినప్పటినుంచి అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అక్టోబర్ 2024 నుండి 12 ఇన్నింగ్స్‌లలో 11.25 సగటుతో 31 వికెట్లు పడగొట్టాడు.