NTV Telugu Site icon

Supreme Court: లక్ష్మణరేఖ ఎక్కడుందో మాకూ తెలుసు.. నోట్ల రద్దును పరిశీలించాల్సిందే..

Supreme Court

Supreme Court

Supreme Court: ప్రభుత్వ విధాన నిర్ణయాలపై న్యాయసమీక్ష పరిమితులకు సంబంధించిన లక్ష్మణరేఖ ఎక్కడుందో తమకు తెలుసని.. అయినా 2016లో ప్రధాని మోదీ సర్కారు ప్రకటించిన నోట్ల రద్దు అంశాన్ని పరిశీలించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2016లో రూ.500, రూ.1000 నోట్లను రద్దుచేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై బుధవారం జస్టిస్‌ ఎస్‌.ఎ.నజీర్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారించింది. నోట్ల రద్దు వ్యర్థ ప్రయాసగా మిగిలిపోయిందా, ఏమైనా ప్రభావం చూపిందా అన్నదానిపై అన్ని అంశాలనూ కూలంకషంగా పరిశీలించి ఒక నిర్ణయానికి వస్తామని ధర్మాసనం వివరించింది. నోట్ల రద్దు అంశంపై సమగ్ర అఫిడవిట్లు సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, భారత రిజర్వ్‌ బ్యాంకును ధర్మాసనం ఆదేశించింది.

Student Suicide: టీచర్‌ను ప్రేమించిన స్టూడెంట్.. ఆమెకు పెళ్లి కుదరడంతో సూసైడ్..

సరైన దృక్కోణంలో నుంచి పిటిషన్‌ సమర్పించకపోతే నోట్ల రద్దు అనేది ప్రస్తుత తరుణంలో కేవలం అకడమిక్‌ అధ్యయన అంశంగానే ఉంటుందని అటార్నీ జనరల్‌ ఆర్‌ వెంకటరమణి వాదించారు. ఇలాంటి అకడమిక్‌ అంశాలపై కోర్టు తన సమయం వృథా చేసుకోరాదని కేంద్రం తరఫున వాదించిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా అభిప్రాయపడ్డారు. ఏ అంశమైనా రాజ్యాంగ ధర్మాసనం ముందుకొచ్చినప్పుడు పరిశీలించి తగిన సమాధానమివ్వడం తమ బాధ్యతని ధర్మాసనం పేర్కొంది. సమస్య అకడమిక్‌ పరిశోధనాంశంగా ఏమీ మారలేదని మరో పిటిషనర్‌ తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది చిదంబరం అన్నారు. ఈ తరహా నోట్ల రద్దుకు పార్లమెంట్‌ ప్రత్యేక చట్టం చేయడం అవసరమని గుర్తుచేశారు. విచారణను ధర్మాసనం నవంబర్‌ 9కి వాయిదా వేసింది.