Site icon NTV Telugu

Rhea Chakraborty: బాలీవుడ్‌ నటి రియా చక్రవర్తికి ఊరట!

Rhea Chakraborty

Rhea Chakraborty

బాలీవుడ్‌ దివంగత నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసులో నటి రియా చక్రవర్తికి ఊరట లభించింది. రియా, ఆమె సోదరుడు షోవిక్‌ చక్రవర్తి, తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తిపై ఉన్న లుక్‌ అవుట్‌ సర్క్యూలర్‌ (ఎల్‌ఓసీ)ను రద్దు చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. మహారాష్ట్ర ప్రభుత్వం, సీబీఐ, ఇమ్మిగ్రేషన్ బ్యూరో దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం సుప్రీంకోర్టు కొట్టేసింది. దాంతో రియాకు భారీ ఊరట లభించినట్టు అయ్యింది.

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ 2020 జూన్‌ 14న ముంబైలోని తన ఫ్లాట్‌లో ఉరేసుకుని మరణించారు. అది ఆత్మహత్య కాదని.. సుశాంత్‌ కుటుంబసభ్యులు రియా చక్రవర్తి, ఆమె కుటుంబసభ్యులపై కేసు పెట్టారు. సుశాంత్‌ బ్యాంకు ఖాతా నుంచి రూ.15 కోట్లు బదిలీ చేసుకున్నారని తండ్రి కేకే సింగ్‌ ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న ఈడీ.. మనీలాండరింగ్‌ జరిగినట్లు భావించి రియాను ప్రశ్నించింది. ఆ తర్వాత ఈ కేసును సుప్రీంకోర్టు సీబీఐకి అప్పగించింది. సుశాంత్‌కు రియా మాదక ద్రవ్యాలు ఇచ్చారని మరో ఆరోపణ కూడా ఉంది. ఈ క్రమంలో రియా, ఆమె సోదరుడు షోవిక్‌ జైలుకు వెళ్లారు.

Also Read: Shikhar Dhawan: ఎవరైనా సాయం చేయండి.. శిఖర్ ధావన్‌ పోస్ట్ వైరల్!

కేసులో భాగంగా రియా చక్రవర్తి, ఆమె సోదరుడు, తండ్రి విదేశాలకు వెళ్లకుండా సీబీఐ ఎల్‌వోసీ జారీ చేసింది. దీనిపై రియా బాంబే హైకోర్టును ఆశ్రయించగా.. ఎల్‌వోసీని రద్దు చేసింది. బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ.. మహారాష్ట్ర ప్రభుత్వం, సీబీఐ, ఇమ్మిగ్రేషన్ బ్యూరోలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. శుక్రవారం వాదోపవాదాలు విన్న సుప్రీంకోర్టు.. బాంబే హైకోర్టు తీర్పును సమర్థిస్తూ, మహారాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను కొట్టేసింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్​లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్​లో తీవ్రత కనిపించడం లేదని పేర్కొంది. నిందితులు కేవలం హైప్రొఫైల్ కాబట్టే పిటిషన్ దాఖలు చేసినట్టు ఉందని వ్యాఖ్యానించింది.

 

Exit mobile version