NTV Telugu Site icon

Sajjala Bhargava Reddy: సుప్రీంకోర్టులో సజ్జల భార్గవరెడ్డికి ఎదురుదెబ్బ!

Sajjala Bhargava Reddy

Sajjala Bhargava Reddy

వైసీపీ సోషల్ మీడియా ఇంఛార్జి, ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల భార్గవరెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. భార్గవరెడ్డి పిటిషన్‌ను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. విజ్ఞప్తులను ఏపీ హైకోర్టు ముందే చెప్పుకోవాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. సజ్జల భార్గవరెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌, ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. పాత విషయాలకు కొత్త చట్టాల ప్రకారం కేసులు పెడుతున్నారని కపిల్‌ చెప్పగా.. చట్టాలు ఎప్పటివనేది కాదని, మహిళలపై చేసిన అసభ్య వ్యాఖ్యలు చూడాలని లూథ్రా వాదించారు. సుప్రీంకోర్టు ముందు చాలా విషయాలు గోప్యంగా ఉంచామని లూథ్రా వెల్లడించారు. దుర్భాషలు ఉపయోగించే ఎవరైనా చట్టపర పరిణామాలను ఎదుర్కోవాల్సిందేనని సుప్రీం పేర్కొంది.

సోషల్ మీడియా పోస్టులపై ఏపీ ప్రభుత్వం తనపై దాఖలు చేసిన కేసులను కొట్టివేయాలని సుప్రీంకోర్టును సజ్జల భార్గవరెడ్డి ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ ఈరోజు అత్యున్నత న్యాయస్థానంలో విచారణకు వచ్చింది. ఇకపై తనపై కేసులు నమోదు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ సజ్జల దాఖలు చేసిన పిటీషన్‌ను సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది. సజ్జల వాదనలను ఏపీ హైకోర్టులో వినిపించాలని, అక్కడే పిటీషన్‌లు దాఖలు చేయాలని సూచించింది. ఏపీ హైకోర్టును ఆశ్రయించేంత వరకూ 2 వారాల పాటు సజ్జలను అరెస్ట్ చేయకూడదని సుప్రీంకోర్టు మధ్యంతర రక్షణ కల్పించింది. రెండు వారాల తరువాత మధ్యంతర రక్షణను పొడిగించాలా? లేదా? అన్నది హైకోర్టు నిర్ణయం తీసుకుంటుందని పేర్కొంది.