తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి తీరుపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. డీఎంకే నేత పొన్ముడిని మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించడానికి అభ్యంతరం వ్యక్తం చేయడంపై గవర్నర్ ప్రవర్తనను ధర్మాసనం తప్పుపట్టింది. ఆస్తుల కేసులో పొన్ముడిని ఇటీవలే మద్రాస్ హైకోర్టు నిర్దోషిగా తేల్చింది. దీంతో స్టాలిన్ ప్రభుత్వం పొన్ముడిని మంత్రివర్గంలోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. కానీ గవర్నర్ మాత్రం అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో స్టాలిన్ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
గవర్నర్ రవి ప్రవర్తనను తప్పుబడుతూ భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించడం సరైంది కాదని వ్యాఖ్యానించారు. చీఫ్ జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం.. గవర్నర్‌కు శుక్రవారం వరకు గడువు విధించింది. 24 గంటల్లో పొన్ముడితో ప్రమాణం చేయించాలని గవర్నర్‌కు కోర్టు ఆదేశించింది. లేకుంటే తాము జోక్యం చేసుకోవల్సి వస్తుందని న్యాయస్థానం హెచ్చరించింది. ధర్మాసనం మాట వినుకుంటే తదుపరి చర్యలకు ఉత్తర్వులు జారీ చేస్తామని పేర్కొంది. కళ్లు తెరిచి ఉన్నామని.. శుక్రవారం లోపు గవర్నర్ నిర్ణయం తీసుకోకపోతే న్యాయస్థానమే జోక్యం చేసుకోవల్సి వస్తుందని పేర్కొంది.
ఇటీవల ఆస్తుల కేసులో పొన్ముడిని మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం స్టే ఇచ్చింది. దీంతో ఆయన్ను స్టాలిన్ ప్రభుత్వం మంత్రివర్గంలోకి తీసుకునేందుకు ఏర్పాటు చేసుకున్నారు. కానీ అందుకు గవర్నర్ రవి నిరాకరించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం.. సుప్రీంను ఆశ్రయించింది. గురువారం విచారణ చేపట్టిన ధర్మాసనం.. గవర్నర్ తీరును తీవ్రంగా తప్పుపట్టింది. శుక్రవారంలోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. లేదంటే తదుపరి చర్యలకు వెళ్లాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చింది.
గవర్నర్ రాజ్యాంగాన్ని గౌరవించాలని సూచించింది. ఎవరైనా సరే రాజ్యాంగానికి లోబడి ఉండాల్సిందేనని తెలిపింది. రాజ్యాంగాన్ని గౌరవించే మంత్రిగా ప్రమాణం చేయించాలని.. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో భాగంగా గవర్నర్ తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని విచారణ సందర్భంగా న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
