NTV Telugu Site icon

Supreme Court: బెంగాల్ టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే

Sue

Sue

పశ్చిమ బెంగాల్ టీచర్ రిక్రూట్‌మెంట్‌ను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దేశ సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. సీబీఐ దర్యాప్తు కొనసాగించడానికి మాత్రం సుప్రీంకోర్టు అనుమతించింది. అయితే ఏ అధికారి లేదా అభ్యర్థిపై ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని ధర్మాసనం సూచించింది.

పశ్చిమ బెంగాల్‌లో 25,000 మందికి పైగా అసిస్టెంట్ టీచర్లు మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ నియామకాన్ని రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతుందని.. అయితే అభ్యర్థులు లేదా అధికారులపై ఎటువంటి బలవంతపు చర్యలు ఉండవని కోర్టు పేర్కొంది.

ఇది కూడా చదవండి: Rythu Bharosa: ఈసీ దెబ్బకు ‘రైతు భరోసా’ నిధులు ఆలస్యం.. మే 13 తర్వాతే..

సార్వత్రిక ఎన్నికల ముందు పశ్చిమ బెంగాల్‌ రాజకీయాలను ఉపాధ్యాయ నియామక కుంభకోణం కుదిపేసింది. హైకోర్టు తీర్పును మమతా బెనర్జీ సర్కార్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.  ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా బెంగాల్‌ ప్రభుత్వానికి కఠిన ప్రశ్నలు సంధించింది. ఎంపిక ప్రక్రియ అంశం కోర్టులో ఉండగానే కొత్త పోస్టులు సృష్టించి నియామకాలు ఎలా చేపట్టారని ప్రశ్నించింది. వ్యవస్థపై ప్రజలు నమ్మకాన్ని కోల్పోతే.. ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటారని ఆగ్రహించింది.

బెంగాల్‌లో 2016 నాటి స్టేట్‌ లెవల్‌ సెలక్షన్‌ టెస్ట్‌ (SLST) నియామక ప్రక్రియ చెల్లదని ఇటీవల కలకత్తా హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ క్రమంలోనే 25,743 మంది టీచర్లు, నాన్‌టీచింగ్‌ సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ఈసందర్భంగా మమత సర్కారు తీరుపై అసహనం వ్యక్తం చేసింది.

ఇది కూడా చదవండి: Supriya Sule: ఓటు వేసి అజిత్ పవార్ తల్లి ఆశీర్వాదం తీసుకున్న సుప్రియా

ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్‌ పాఠశాలల్లో 9 నుంచి 12 తరగతులకు ఉపాధ్యాయులతో పాటు గ్రూప్‌ సి, గ్రూప్‌ డి స్టాఫ్‌ సిబ్బంది నియామకాల కోసం 2016లో బెంగాల్‌ సర్కారు రాష్ట్రస్థాయి సెలక్షన్‌ పరీక్ష నిర్వహించింది. 24,650 ఖాళీల భర్తీ కోసం చేపట్టిన ఈ రిక్రూట్‌మెంట్‌ పరీక్షకు 23 లక్షల మందికి పైగా హాజరయ్యారు. ఇందులో అవకతవకలు జరిగినట్లు అప్పట్లోనే ఆరోపణలు రాగా.. ఈ వ్యవహారం కోర్టుకు చేరింది. ఆ అంశం పెండింగ్‌లో ఉండగానే.. ఇందులో ఎంపిక ప్రక్రియను చేపట్టి 25,753 మందికి అపాయింట్‌మెంట్‌ లెటర్లు అందజేశారు. ఖాళీల కంటే అదనంగా కొంతమందిని నియమించడంపై వివాదాస్పదమైంది. ఈ క్రమంలోనే నాటి నియామక ప్రక్రియను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. తాజాగా మంగళవారం హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది.

ఇది కూడా చదవండి: Ponnam Prabhakar : కావాలనే రైతు భరోసా విడుదలను అడ్డుకుంటున్నారు