Site icon NTV Telugu

Supreme Court: అవినాష్‌రెడ్డి బెయిల్‌ రద్దు విషయంలో కీలక పరిణామం..

Supreme Court

Supreme Court

Supreme Court: వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో సునీత వేసిన పిటిషన్‌పై వాదనలు జరిగాయి. అవినాష్‌రెడ్డికి వ్యతిరేకంగా సునీత స్వయంగా వాదనలు వినిపించారు. అయితే సునీతకు సహకరించేందుకు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లుథ్రాను అనుమతించింది బెంచ్. తన తండ్రి వివేకా హత్య కేసులో అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనానికి సునీత విజ్ఞప్తి చేశారు. సీబీఐ విచారణకు అవినాష్‌రెడ్డి సహకరించడం లేదని, ఏప్రిల్ 24 తర్వాత మూడు సార్లు నోటీసులిచ్చినా విచారణకు హాజరుకాలేదని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే.. ఈ కేసులో అంత అత్యవసరమైన పరిస్థితి ఏముందని జస్టిస్ విక్రమ్‌నాథ్ ప్రశ్నించారు. వెకేషన్ ముందున్న బెంచ్‌కు రావాల్సిన పరిస్థితి ఉందా.. అని ప్రశ్నించగా.., ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలా? లేదా? అన్నది దర్యాప్తు సంస్థ చూసుకుంటుందన్నారు మరో న్యాయమూర్తి జస్టిస్‌ అమానుల్లా. ఎవరిని ఎప్పుడు అరెస్టు చేయాలో.. ఎవరిని కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాలో సీబీఐకి తెలుసన్నారు. అవినాష్ కస్టోడియల్ విచారణ అవసరమా లేదా అన్నది దర్యాప్తు సంస్థ వ్యవహారమన్న బెంచ్, విచారణకు సహకరిస్తున్నారా లేదా అన్నది దర్యాప్యు సంస్థ పరిధిలోని అంశమని స్పష్టం చేసింది. సెలవుల అనంతరం పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తామని చెప్పింది సుప్రీం ధర్మాసనం.

Read Also: Ponguleti Srinivasa Reddy: సస్పెన్ష్‌కు తెరదించిన పొంగులేటి.. అమిత్‌ షా ఖమ్మం రాకముందే..!

తొందరపడి వ్యక్తిగతంగా వాదనలు వినిపించాలనుకుంటే నష్టపోతారని, మీ పిటిషన్‌ను కోర్టు డిస్మిస్ చేస్తే.. తర్వాత వచ్చే లాయర్‌కు ఇబ్బందులెదురవుతాయని సుప్రీంకోర్టు బెంచ్‌ హెచ్చరించింది. వాదనలు వినిపించే సమయంలో సునీత కాస్త తడబడడంతో ఆమె తరపున సీనియర్‌ న్యాయవాది లూథ్రా వాదనలు వినిపించారు. వివేకా హత్య కేసులో సీబీఐకు ఇచ్చిన గడువు ఈ నెలాఖరుతో ముగుస్తుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో బెంచ్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. వాదనలు వద్దంటున్నా తలదూర్చాలనుకుంటున్నారని లూథ్రాపై ఆగ్రహం చేస్తూ, ఈ కోర్టులోనే ఒక బెంచ్‌ విధించిన గడువుపై మళ్లీ ఉత్తర్వులు ఇవ్వాలా అని ప్రశ్నించింది. విచారణకు హాజరుకావాలని సీబీఐను ఆదేశించేలా ఉత్తర్వులు ఇవ్వాలని సునీత వాదిస్తే.. అలాంటి ఉత్తర్వులు మేమెలా ఇస్తామని, విచారణకు రావాలా లేదా అనేది సీబీఐ ఇష్టమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను జూన్ 19వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం.

Exit mobile version