Sunil Gavaskar on Rahul Dravid: గతవారం బార్బడోస్‌లో జరిగిన ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను 7 పరుగుల తేడాతో ఓడించిన భారత్.. టీ20 ప్రపంచకప్ 2024 ట్రోఫీని కైవసం చేసుకుంది. దాంతో 11 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత జట్టు ఐసీసీ టైటిల్‌ను ముద్దాడింది. భారత్ విజయంలో ఆటగాళ్లతో పాటుగా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పాత్ర కూడా ఎంతో ఉంది. గత సెప్టెంబర్‌లోనే ద్రవిడ్ పదవి కాలం ముగియగా.. కెప్టెన్ రోహిత్ శర్మ విజ్ఞప్తితోటీ20 ప్రపంచకప్ వరకు కొనసాగాడు. టీ20 ప్రపంచకప్ విజయంతో తమ కోచ్‌కు భారత ఆటగాళ్లు ఘనంగా విడ్కోలు పలికారు.
భారత్ టీ20 ప్రపంచకప్ 2024 ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించిన రాహుల్ ద్రవిడ్‌కు దేశ అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కోరారు. ‘రాహుల్ ద్రవిడ్‌ను భారతరత్నతో సత్కరిస్తే బాగుంటుంది. అందుకు ది వాల్ అర్హుడు. వెస్టిండీస్ వంటి కఠిన పరిస్ధితుల్లో ద్రవిడ్ ఒక ఆటగాడిగా, కెప్టెన్‌గా ఎన్నో అద్బుత విజయాలు అందుకున్నాడు. ఇంగ్లండ్ వంటి విదేశీ పరిస్థితుల్లో కూడా సారథిగా టీమిండియాకు చారిత్రత్మక విజయాలను అందించాడు. ఇంగ్లండ్‌లో టెస్ట్ మ్యాచ్ సిరీస్‌ను గెలుచుకున్న ముగ్గురు భారత కెప్టెన్లలో ద్రవిడ్ ఒకడు’ అని సన్నీ అన్నారు.
Also Read: Gautam Gambhir: అతడే టీమిండియా అత్యుత్తమ కెప్టెన్: గంభీర్
‘రాహుల్ ద్రవిడ్ జాతీయ క్రికెట్ అకాడమీ ఛైర్మన్‌గా పనిచేసి ఎంతో మంది యువ క్రికెటర్లను ప్రపంచానికి పరిచయం చేశాడు. భారత పురుషల సీనియర్ జట్టు కోచ్‌గా అద్భుతాలు సృష్టించాడు. ద్రవిడ్ నేతృత్వంలోనే 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్‌ను భారత్ సొంతం చేసుకుంది. ఆటగాడిగా, కెప్టెన్‌గా, కోచ్‌గా ద్రవిడ్ సాధించిన విజయాలు ప్రతీ భారతీయుడికి ఆనందనిచ్చాయి. ప్రపంచకప్ విజయంతో భారతదేశం మొత్తం గర్వించేలా చేశాడు. అటువంటి వ్యక్తికి దేశ అత్యున్నత పురస్కారంతో గౌరవించాలి. ఈ విషయంపై ప్రతీ ఒక్కరూ నాతో గొంతు కలపాలి. కేంద్ర ప్రభుత్వం ద్రవిడ్ సేవలను గుర్తించాలి. భారతరత్న రాహుల్ ద్రవిడ్ అని వినడానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది’ అని సునీల్ గవాస్కర్ పేర్కొన్నారు. భారత్ అండర్ 19, భారత్-ఏ జట్టుకు కోచ్‌గా వ్యవహరించాడు. ఆపని ఎన్‌సీఏ డైరెక్టర్‌గా ఉండి.. టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు.