Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో వేసవి సెలవులను ఈ నెల 12 వరకు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం 12న పాఠశాలలు పునఃప్రారంభం కావాల్సి ఉండగా.. తాజా మార్పుతో 13న రీఓపెన్ అవుతాయని సర్కారు తెలిపింది. వేసవి సెలవులను ప్రభుత్వం ఓ రోజు పెంచింది. ఈ నెల 12న సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెసులుబాటు కల్పించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరాయి. వారి కోరిక మేరకు స్పందించిన ప్రభుత్వం సెలవులను మరో రోజు పొడిగించింది.
Read Also: Bandi Sanjay : ఈస్థాయికి వస్తానని అస్సలు ఊహించలేదు
చంద్రబాబు ప్రమాణస్వీకారానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.. ఈ నెల 12న ఉదయం 11.27 నిమిషాలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రధానితో పాటు వీఐపీలురానుండడంతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం ఐటీ పార్కు సమీపంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లను రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి (రవాణా, రోడ్లు, భవనాలు) ప్రద్యుమ్న పరిశీలించారు. ప్రద్యుమ్న శనివారం గన్నవరంలో పర్యటించి జూన్ 12న ప్రమాణ స్వీకారోత్సవం ఏర్పాట్లను పరిశీలించారు. గన్నవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గన్నవరం సమీపంలోని కేసరపల్లి గ్రామంలోని ఐటీ మేధా పార్కు సమీపంలో ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర నేతలు హాజరవుతారని తెలిపారు. సీటింగ్, వేదిక, బారికేడింగ్, భద్రత, పార్కింగ్, పారిశుధ్యంపై జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఇతర అధికారులతో చర్చించారు.