Director Sukumar: పుష్ప – 3 సినిమా ఉంటుందని ప్రముఖ సినిమా దర్శకులు సుకుమార్ ప్రకటించారు. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా పెద్ది సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నానని అన్నారు. రాజమండ్రిలో ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనటానికి వచ్చిన ప్రముఖ సినిమా దర్శకులు సుకుమార్ సందడి చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. “పుష్ప- 3 సినిమా ఉంటుంది. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా పెద్ది సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాను. నా సినిమాలు అన్ని గోదావరి జిల్లాలోనే ఎక్కువగా తీస్తున్నాను. గోదావరి జిల్లాల వాడిని కావడం నా అదృష్టం. రాజమండ్రి అంటే తనకెంతో ఇష్టం.. సింధూరం, రంగస్థలం, పుష్ప వంటి సూపర్ హిట్ చిత్రాలు ఇక్కడే తీశాను.” అని అన్నారు.
ఇదిలా ఉండగా.. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ గతంలో ‘పుష్ప 3’ అప్‌డేట్ ఇచ్చారు. ‘పుష్ప 2’ విజయం అందుకున్న సందర్భంగా పాల్గొన్న ఇంటర్వ్యూలో దాని సీక్వెల్ గురించి వెల్లడించారు. దర్శకుడు సుకుమార్ ‘పుష్ప’ పార్ట్ 3కి సంబంధించి నిరంతరం పని చేస్తున్నారని, ఆ స్టోరీపై రీవర్క్ కూడా చేస్తున్నారని తెలిపారు. అంచనాలు ఉన్న నేపథ్యంలో ‘పుష్ప 3’ విషయంలో మీపై ఒత్తిడి ఉండనుందా? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘వృత్తిపరంగా నేనెప్పుడూ టెన్షన్ పడను. ఒత్తిడి ఉంటే క్రియేటివిటీ ఉండదు. ‘పుష్ప 2’కి ది బెస్ట్ ఇవ్వాలని నేను, సుకుమార్, పాటల రచయిత చంద్రబోస్ ముందు నుంచీ అనుకుని, ఆ మేరకు పని చేశాం. సుకుమార్ మంచి స్క్రిప్టు రాశారు. అల్లు అర్జున్ అద్భుతంగా నటించారు. ఇతర నటులు, టెక్నిషియన్లు ఎంతో కష్టపడ్డారు. ‘పుష్ప 1’, ‘పుష్ప 2’కి ఎలా పనిచేశామో ‘పుష్ప 3’కి అదే స్థాయిలో కష్టపడతాం. సుకుమార్ విజన్, ఆయన స్టోరీలు మాకు స్ఫూర్తి’’ అని పేర్కొన్నారు.