దాయాది దేశం పాకిస్తాన్ లో మరోసారి ముష్కర మూకలు రెచ్చిపోయాయి. పదుల సంఖ్యలో అమాయకుల ప్రాణాలను బలితీసుకున్నారు ఉగ్రవాదులు. తనని తాను పేల్చుకొని ఆత్మహుతి దాడి చేసి ఎంతో మందిని బలితీసుకున్నాడు ఓ దుర్మార్గుడు. బలూచిస్థాన్ ప్రావిన్సులోని మస్తుంగ్ జిల్లాలో ఇది జరిగింది. మహ్మద్ ప్రవక్త జయంతిని పురస్కరించుకుని భక్తులు ఎంతో సంతోషంగా ర్యాలీకి సమాయత్తం అవుతున్నారు మస్తుంగ్ జిల్లాలో. ఇంతలోనే ఓ అనుకోని ఘటన జరిగింది.
Also Read: Cars under 6 Lakhs: రూ.6 లక్షల లోపు.. 27కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే కార్లు ఇవే
ఓ ఉగ్రవాది తనను తాను పేల్చేసుకున్నాడు. దీంతో అక్కడ అంతా భీతావాహ వాతావరణం ఏర్పడింది. ఆత్మాహుతిదాడిలో 52 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందికిపైగా గాయపడ్డారు. గాయపడిన వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారిలో కొంతమంది పరిస్థితి విషయమంగా ఉన్నట్లు తెలుస్తోంది. భారీ పేలుడు కారణంగా మృతదేహాలు చెల్లాచెదురయ్యాయి. శరీర భాగాలు తునకలయ్యాయి. ముస్తుంగ్‌లో ఈ నెలలో జరిగిన రెండో అతిపెద్ద పేలుడు ఇది.
ఇటీవల జరిగిన పేలుడులో జామియత్ ఉలేమా-ఇ-ఇస్లామ్ ఫజల్ నేత హఫీజ్ హమ్దుల్లా సహా పలువురు గాయపడ్డారు. ఇక ఈ దాడికి సంబంధించిన వివరాలను అందించిన పోలీసులు ఈ దాడిలో డీఎస్పీ గష్కోరీ కూడా ఉన్నట్టు వెల్లడించారు. అయితే ఈ ఆత్మాహుతి దాడికి సంబంధించి ఇప్పటి వరకు తామే చేసినట్లు ఎవరు కూడా బాధ్యత వహించలేదని పోలీసులు తెలిపారు. ఇక ఈ ఆత్మహుతి దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని ‘ది పాకిస్థాన్ తాలిబన్’ (టీటీపీ) స్పష్టం చేసింది.