ఉమ్మడి కడప జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, సీనియర్ నేత సుగవాసి బాలసుబ్రమణ్యం నేడు వైసీపీలో చేరనున్నారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో సుగవాసి వైసీపీలో చేరనున్నారు. మాజీ టీడీపీ నేత బాలసుబ్రమణ్యం ఇప్పటికే రాయచోటి నుండి విజయవాడకు బయల్దేరారు. ఈరోజు మధ్యాహ్నం ఒకటిన్నరకు తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో బాలసుబ్రమణ్యం జగన్ చేతుల మీదుగా పార్టీ కండువా కప్పుకోనున్నారు. రాయచోటి నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్న సుబ్రహ్మణ్యం రాకతో.. వైసీపీకి మరింత బలం చేకూరనుంది. బాలసుబ్రమణ్యం పార్టీని వీడడం రాజకీయంగా టీడీపీకి దెబ్బే అనే చెప్పాలి.
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సుగవాసి పాలకొండ్రాయుడు పెద్ద కుమారుడే బాలసుబ్రమణ్యం. సుగవాసి కుటుంబం నాలుగు దశాబ్దాలుగా టీడీపీలో కొనసాగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదికే బాలసుబ్రమణ్యం టీడీపీకి బై బై చెప్పారు. ఇటీవలి పరిణామాలు తమను టీవీరంగా బాధించాయంటూ పార్టీకి రాజీనామా చేశారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ.. తనకు ప్రాధాన్యం దక్కలేదనే అసంతృప్తిలో ఉన్నారు. అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రాజుకు ప్రాధాన్యం ఇవ్వడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. అంతేకాదు తండ్రి పాలకొండ్రాయుడు చనిపోతే.. కనీసం టీడీపీ పార్టీ తరపున ఒక్కరు కూడా అంత్యక్రియల్లో పాల్గొనేందుకు రాకపోవడం ఆయన్ను బాగా హర్ట్ చేసింది.
ఈ పరిణామాల నేపథ్యంలో టీడీపీలో కొనసాగడం ఇష్టం లేని సుగవాసి బాలసుబ్రమణ్యం.. ఆ పార్టీకి రాజీనామా చేశారు. నేడు వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. 2024 ఎన్నికల్లో బాలసుబ్రమణ్యం టీడీపీ తరపున రాజంపేట నుంచి పోటీ చేసి.. వైసీపీ అభ్యర్థి ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. సుగవాసి రాజకీయ వారసుడిగా బాలసుబ్రమణ్యం 1995 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. ముందుగా రాయచోటి జడ్పీటీసీ సభ్యుడిగా గెలిచారు. 2000లో ఉమ్మడి కడప జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. 2001లో మరోసారి జడ్పీటీసీగా విజయం సాధించారు. 2012లో రాయచోటి ఉప ఎన్నికలో ఓడిపోయారు. 2024లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు.