అక్కడ ఇచ్చే పెన్నుల కోసం ప్రతిఒక్కరు ఎంతగానో ఎదురు చూస్తారు. పరీక్షలు రాయబోయే విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా వీటి కోసం పోటీ పడతారు. పరీక్షలు వచ్చాయంటే విద్యార్థుల్లో భయం ఒక ఎత్తైతే.. తల్లిదండ్రుల ఆందోళన మరోఎత్తు. అయితే కొందరు తల్లిదండ్రులు, విద్యార్థులు మాత్రం ఓ పెన్ను కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అక్కడి నుంచి తీసుకొచ్చిన పెన్నుతో పరీక్షలు రాస్తే విజయం సొంతమట. అదే అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి పెన్నుల పండుగ. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాణిపాకం విఘ్నేశ్వర ఆలయం తర్వాత అంతటి ప్రాముఖ్యమైన దేవాలయం అయినవిల్లి విఘ్నేశ్వర స్వామివారి ఆలయం. విద్యను ప్రసాదించే ఆదిగణపతిగా కొలువైన విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ఏటా చదువుల పండుగ అత్యంత వైభవంగా జరుగుతోంది. అంబేథ్కర్ కోనసీమ జిల్లాలో కొలువై ఉన్న ఈ ఆలయంలో ఈ ఏడాది కూడా మూడు రోజుల పాటు దిగ్విజయంగా చదువుల పండుగ జరిగింది. స్వామి వారి పాదాలు వద్ద ప్రత్యేకంగా పూజలు చేసిన పెన్నులు తీసుకొని పరీక్షలు రాస్తే మంచి ఫలితాలు వస్తాయని భక్తుల నమ్మకం. ఈ నేపథ్యంలో స్వామి వారి పాదాల చెంత అభిషేకం చేసిన పెన్నులను ఆలయ ఈవో ముదునూరి సత్యనారాయణ రాజు అట్టహాసంగా పంపిణీ చేశారు. స్వామివారి ప్రసాదంగా స్వీకరించే పెన్నులు కోసం వచ్చిన విద్యార్థులు, భక్తులతో ఆలయం కిక్కీరిసిపోయింది. అధిక సంఖ్యలో విద్యార్దుల రాకతో సుమారు కిలోమీటరు మేర పెన్నులు తీసుకునేందుకు బారులు తీరారు. స్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఆలయ ఈవో ముందస్తు చర్యలు చేపట్టారు.
గత 12 ఏళ్లుగా సంప్రదాయంగా చదువుల పండుగ నిర్వహించి పరీక్షలు ముందు పెన్నులు పంపిణీ చేస్తారు. 2012లో తొలిసారిగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. 12 ఏళ్ల నుంచి ఈ ప్రక్రియను నిర్విఘ్నంగా సాగుతోంది. పెన్నుల పండుగా పిలుచుకునే ఈ కార్యక్రమం కోసం ఏటా విద్యార్థులు ఆసక్తితో ఎదురు చూస్తుంటారు. ఈ ఏడాది కూడా శ్రీ పంచమిని పురస్కరించుకుని సప్త నదీ జలాలతో రుద్రాబి, షేకం, సరస్వతి పూజ అనంతరం విఘ్నేశ్వరుని సన్నిధిలో పెన్నులు ఉంచి ఆలయ అర్చకులు పూజలు చేశారు. వీటిని విద్యార్థులకు పంపించడం ఆనవాయితీగా జరుగుతోంది. దీంతో పరీక్షలు రాసే విద్యార్థులు కోసం వారి తల్లిదండ్రులు ఎంతో ఇష్టంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చి మరీ ఈ పెన్నులు తీసుకెళ్ళుతున్నారు. స్థానికంగా పంపిణీ చేసే పెన్నులు పూర్తిగా ఉచితం కాగా.. దూర ప్రాంతాలకు పోస్టల్ ద్వారా పంపించేందుకు నిర్ణీత రుసుము రూ. 250 రూపాయాలు చెల్లించిన వారికి గోత్రనామాలతో సప్తనదీ జలాలతో అభిషేకం జరిపించి పది కలములు అందిస్తున్నారు. రెండు లక్షల పెన్నుల పంపిణీలో భాగంగా సుమారు లక్షా ఇరవై వేల పెన్నులను దూర ప్రాంతాల నుంచి ఆర్డర్ పెట్టిన విద్యార్థుల కోసం కొరియర్, పోస్టల్, పార్సిల్లో పంపిస్తున్నామని అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ముదునూరి సత్యనారాయణ రాజు అంటున్నారు.