Site icon NTV Telugu

Students Protest : TSPSC పేపర్ లీక్.. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు

Students Protest

Students Protest

తెలంగాణలో ప్రకంపనలు రేపిన TSPSC పేపర్ లీకేజీ వ్యవహారంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్నంతా విద్యార్థి సంఘాల నిరసనలతో భగ్గుమన్న టీఎస్పీఎస్సీ కార్యాలయ పరిసరాలు రెండోరోజూ మరోసారి నిరసనలతో హోరెత్తిపోయాయి. ఈ ఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున కార్యాలయం ముట్టడికి వెళ్లడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏబీవీపీ, ఆప్, విద్యార్థి సంఘాలు టీఎస్పీఎస్సీ కార్యాలయానికి తరలివచ్చి ఆందోళన చేశారు.

Also Read : Today (15-03-23) Stock Market Roundup: 17 వేల దిగువకి నిఫ్టీ50

టీఎస్పీఎస్సీ కార్యాలయం దగ్గర విద్యార్థి సంఘాల నినాదాలతో దద్దరిల్లింది. దీంతో టీఎస్పీఎస్సీ పరిసరాలలో పెద్ద ఎత్తున పోలీసులు భారీగా మోహరించారు. టీఎస్పీఎస్సీ కమిషన్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించిన విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు లాక్కెళ్లి వాహనాల్లో ఎక్కించి పీఎస్ కు తరలించారు. పెద్ద ఎత్తున ఆందోళనలు నినాదాలతో ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో పలు జిల్లా కేంద్రాల్లో కూడా విద్యార్థి సంఘాలు నిరసనకు దిగాయి. ప్రశ్నాపత్రాల లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి.. ప్రశ్నాపత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేసీఆర్ రాజీనామా చేయాలి.. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయాలి.. ఏవైతే ప్రశ్నాపత్రాలు లీకయ్యాయో ఆ పరీక్షలను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలి అని ఏబీవీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. అదే విధంగా టీఎస్పీఎస్సీ ముట్టడికి యత్నించిన ఆప్, ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు.

Also Read : Pakistan Economic Crisis: లగ్జరీ కార్లను తిరిగి ఇచ్చేందుకు ససేమిరా అంటున్న పాక్ మంత్రులు..

పేపర్ లీకేజీ ఘటనపై ఓయూలోని విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీకి ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలన్నారు. ప్రశ్నాపత్రాలు లీక్ చేసి అమ్ముకుంటున్న వారిని కఠినంగా శిక్షించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఆందోళన ఉద్ధృతంగా మారడంతో పోలీసులు విద్యార్థులను అరెస్ట్ చేసిన ఓయూ పీఎస్ కు తరలించారు. మరో వైపు వరుస ఆందోళనల దృష్ట్యా టీఎస్పీఎస్సీ వద్ద మోహరించిన అదనపు బలగాల భద్రతను డీసీపీ కిరణ్ కరే పర్యవేక్షిస్తున్నారు.

Also Read : Jeevan Reddy : టీఎస్పీఎస్సీపై మంత్రులు ఎందుకు స్పందించడం లేదు..

మరోవైపు ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, డిచ్ పల్లిలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. విద్యా్ర్థులు, ఉద్యోగార్థులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. పేపర్ లీక్ వ్యవహారంలో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగుతామని విద్యార్థి సంఘాలు హెచ్చరించాయి. నిరంతరం కష్టపడి అనేక ఇబ్బందులు పడి ఉద్యోగాల కోసం రాత్రింబవళ్లు చదువుతుంటే.. ఇలాంటి ఘటనలు తమ జీవితాలను నాశనం చేసేలా మారాయని నిరుద్యోగులు వాపోయారు.

Exit mobile version