Site icon NTV Telugu

RTC Strike: తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్.. నోటీసు ఇచ్చిన కార్మిక జేఏసీ

Samme

Samme

తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఆర్టీసీ యాజమాన్యానికి కార్మిక జేఏసీ నోటీసు ఇచ్చింది. బస్ భవన్‌లో అధికారులకు కార్మిక సంఘం నేతలు సమ్మె నోటీసు ఇచ్చారు. 21 డిమాండ్లతో సమ్మె నోటీసులు యాజమాన్యానికి అందించారు ఆర్టీసీ యూనియన్ నేతలు. తమ సమస్యలు పరిష్కరించకపోతే వచ్చే నెల (ఫిబ్రవరి 9) సమ్మె బాట పడతామని కార్మిక జేఏసీ తెలిపింది. గతంలో ప్రభుత్వం హామీలను అమలు చేయాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు నోటీస్​‌లో తెలిపింది. ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం కార్మిక సంఘాలు సమ్మెకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు భారీ ఎత్తున బస్‌ భవన్‌ వద్దకు రావడంతో పోలీసులను భారీ సంఖ్యలో మోహరించారు.

Read Also: Rahul Gandhi: రాజ్యాంగంపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్ర.. కాంగ్రెస్ కాపాడింది..

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి 14 నెలలైన ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆర్టీసీ జేఏసీ తెలిపింది. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పినట్లుగా తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే.. సీసీఎస్, పీఎఫ్ డబ్బులు రూ.2,700 కోట్లు వెంటనే చెల్లించాలని కూడా వారు డిమాండ్‌ చేశారు. వీటిని నెరవేర్చకుంటే సమ్మెకు దిగుతామని కార్మిక సంఘాలు నోటీసుల్లో పేర్కొన్నాయి. మరోవైపు.. ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో డిపోలను ప్రభుత్వం ప్రైవేటు సంస్థల చేతుల్లో పెడుతుందని జేఏసీ నేతలు ఆరోపించారు. ప్రైవేటు కంపెనీల ద్వారా ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావడం వల్ల ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని తెలిపారు. ప్రభుత్వంలో విలీనం, 2021 పీఆర్సీ, 2017 వేతన పెండింగ్ బకాయిల సమస్యలు పరిష్కారం కాలేదని జేఏసీ నేతలు ప్రధానంగా ఆరోపించారు. కాగా.. ఆర్టీసీ పరిరక్షణకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుచేయాలంటూ ఈరోజు సమ్మె నోటీస్‌ ఇవ్వాలని టీజీఎస్‌ఆర్టీసీ జేఏసీ గతంలోనే నిర్ణయించింది.

Read Also: Hanumakonda: రోడ్డు ప్రమాదం.. 20 మంది కూలీలకు గాయాలు, ముగ్గురి పరిస్థితి విషమం

Exit mobile version