NTV Telugu Site icon

CM Revanth Reddy: లా అండ్ ఆర్డర్ పట్ల కఠినంగా వ్యవహరించాలి.. డీజీపీకి సీఎం రేవంత్ ఆదేశాలు

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy: తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పట్ల కఠినంగా వ్యవహరించాలని డీజీపీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. పెద్దపల్లి జిల్లాలో జరిగిన మైనర్ అమ్మాయి అత్యాచారం, హత్య ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేయాలని డీజీపీని ఆదేశించారు. పోక్సో చట్టాన్ని, ఐపీసీ చట్టాన్ని వినియోగించి, ఫోరెన్సిక్‌ను సమర్థంగా వాడుకొని కేసును పకడ్బందీగా విచారణ చేసి అతిత్వరగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని డీజీపీకి ఆదేశాలు ఇచ్చారు. నిందితునికి కఠిన శిక్ష పడేలా చూడాలని ఆదేశించారు. పెద్దపల్లి జిల్లాలో ఆరేండ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన అమానుష ఘటనపై ముఖ్యమంత్రి ఏ.రేవంత్​ రెడ్డి తీవ్రంగా స్పందించారు. వెంటనే ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తగిన న్యాయం చేస్తుందని భరోసా ఇచ్చారు.

Read Also: Ganja Gang Hulchul: కొత్తపేటలో గంజాయి బ్యాచ్ వీరంగం.. వ్యక్తిపై విచక్షణారహితంగా దాడి

మరోవైపు నారాయణపేట జిల్లా ఉట్కూర్ మండలంలో పట్టపగలు గువ్వల సంజీవ్ అనే వ్యక్తిని కొట్టి చంపిన ఘటనపై ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి సీరియస్‌గా స్పందించారు. భౌతిక దాడులకు దిగి అరాచకాలు, హత్యలకు పాల్పడే శక్తులు ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ ఘటనకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే, అక్కడి బాధ్యులైన పోలీసు అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు.

భూవివాదం కారణంగా నారాయణపేట జిల్లా ఉట్కూరులో సంజీవ్‌ అనే వ్యక్తిని కొట్టి చంపిన ఘటనను రాష్ట్ర సర్కారు సీరియస్‌గా తీసుకుంది. భౌతిక దాడులకు దిగి అరాచకాలు, హత్యలకు పాల్పడే శక్తులు ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ ఘటనకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే, అక్కడి బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఉట్కూరు ఎస్సై బిజ్జ శ్రీనివాసులును సస్పెండ్‌ చేశారు.

Show comments