Storyboard: తెలుగు రాష్ట్రాల్లో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు డౌటేనని ఇప్పటిదాకా విశ్లేషకుల సందేహించారు. ఇప్పుడ కొత్తగా రాజకీయ పార్టీలు, కీలక స్థానాల్లో ఉన్న నేతలు కూడా అనుమానపడుతున్నారు. ఏపీలో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగినా.. లోక్ సభ ఎన్నికలతో కలిపే జరుగుతాయి. కాబట్టి కొత్తగా జమిలి పేరుతో వచ్చినా పోయేదేముందనే యోచనలో ఉన్నాయి ఆ రాష్ట్రంలో పార్టీలు. అయినా సరే ఎందుకైనా మంచిదని నేతలకు, క్యాడర్ కు మెసేజ్ పాస్ చేస్తున్నాయి. కానీ తెలంగాణ పరిస్థితి వేరు. షెడ్యూల్ ప్రకారం అయితే మరో రెండు నెలల్లో పోలింగ్ జరగాలి. తెలంగాణ అసెంబ్లీకి జనవరి 16నాటికి గడువు తీరుతుంది. ఆలోగా కొత్త శాసనసభ ఏర్పడాలి. ఇది షెడ్యూల్ ప్రకారం అయితే సంగతి. కానీ కేంద్రం అనుకున్నట్టుగా మినీ జమిలి అయితే.. ఎన్నికలు మరో ఆరు నెలలు వెనక్కి వెళ్లే అవకాశం ఉంది. అప్పుడు తెలంగాణలో ఎన్నికలకు ఇంకా 8 నెలల టైముంటుంది. అప్పుడు రాజకీయ పార్టీల సమీకరణాలు మారే అవకాశాలున్నాయి.
కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో కీలక నేతలు ఎన్నికలపై చేస్తున్న కామెంట్లు సందేహాలకు తావిస్తున్నాయి. గతంలో ఢిల్లీ వెళ్లి వచ్చినప్పుడే జగన్ ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీగా ఉండాలని మంత్రులకు చెప్పినట్టుగా వార్తలొచ్చాయి. ఆ తర్వాత ఇటీవలే కేసీఆర్ కూడా కేంద్రం జమిలి పెట్టాలనుకుంటే ఎవరూ ఆపలేరని పార్టీ నేతలకు చెప్పారు. మరో కీలక నేత కూడా ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయా.. లేదా అనే ప్రశ్నను లేవనెత్తారు. ఇవన్నీ జమిలిపై తెలుగు రాష్ట్రాల నేతలకు సంకేతాలున్నాయేమోననే అనుమానాలు బలపడేలా చేస్తున్నాయి. కేంద్రం నుంచి సంకేతాలు అందాయా.. లేకపోతే కేంద్రం మూడ్ అర్థం చేసుకుని వీళ్లు ముందే రెడీ అవుతున్నారా అనే చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం రాజకీయ తెరపై హాట్ గా ఉన్న వాదనైతే ఇవే. ఇందులో జమిలికి కాస్త ప్రాసెస్ ఉంది కాబట్టి మినీ జమిలి అనేది అటు కేంద్రానికి, ఇటు రాష్ట్రాలకు ఉభయకుశలోపరిగా ఉంటుందనే లాజిక్ ఉంది. ఈ లాజిక్ కు బలం ఉంది కాబట్టే.. తెలుగు రాష్ట్రాల నేతలు కూడా ఆ రకంగా వచ్చే ఎన్నికలను ఎదుర్కోవడానికి సైలంట్ గా తయారవుతున్నారు. అయితే లేటెస్ట్ పాయింట్ ఏంటంటే మినీ జమిలి కూడా జనవరి, ఫిబ్రవరిలో కాదు.. ఏప్రిల్, మే లో జరగొచ్చనే అంచనాలే. అసలు ఎన్నికల షెడ్యూల్ పై సందేహం ఎందుకొచ్చింది అనేది ఇక్కడ కీలకం. మోడీ మొదట్నుంచీ జమిలి జపం చేస్తున్నారు. ఇటీవల మినీ జమిలి అంశం కూడా తెరపైకి వచ్చింది. పైగా ఏపీ ఎన్నికలు ఎలాగో లోక్ సభతో కలిసే జరుగుతాయి. తెలంగాణ ఎన్నికలు కూడా లోక్ సభ ఎన్నికలకు ఆర్నెళ్ల ముందే జరుగుతాయి. ఈ ఎన్నికలు వాయిదా వేసి.. జమిలి పెట్టేయడం పెద్ద కష్టం కాదనే వాదనను రాజకీయ వర్గాలు కాదనలేని స్థితి. అందుకే కీడెంచి మేలెంచాలనే పద్ధతిలో తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలు జమిలి వస్తుందనుకునే వ్యూహాలు మార్చుకుంటున్నాయి. ఎన్నికలు ఎలా వచ్చినా రెడీగా ఉండాలని క్యాడర్ కు నూరిపోస్తున్నాయి. ఎన్నికలు ఏ పద్ధతిలో వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో ముందే అంచనా వేసి.. అందుకు అనుగుణంగా ప్రిపేర్ అవ్వడం మినహా మరో మార్గం లేదనే విధంగా ఉంది తెలుగు రాజకీయ పార్టీల వైఖరి.
ఉమ్మడి రాష్ట్రానికి ఎప్పట్నుంచో లోక్ సభతో పాటే ఎన్నికలు జరిగేవి. తెలుగు ప్రజలకు జమిలి కొత్త కాదు. కాకాపోతే రాష్ట్ర విభజన తర్వాత కేవలం గత ఎన్నికలు మాత్రమే తెలంగాణకు విడిగా జరిగాయి. ఇప్పుడు జమిలి అయితే మళ్లీ లోక్ సభతో పాటే జరుగుతాయి. ఇందులో పెద్దగా మారేదేముందనే చర్చ లేకపోలేదు. అయితే పార్టీల బలాబలాలు, గెలుపోటముల విషయంలో ప్రభావం లేకపోయినా.. వ్యూహరచనలో ఎంతో కొంత తేడా ఉంటుందనే వాదన వినిపిస్తోంది. తెలంగాణలో జనవరి 16తో అసెంబ్లీ గడువు ముగుస్తుంది. రాజ్యాంగం ప్రకారం ఈలోగా ఎన్నికలు జరిగి.. కొత్త అసెంబ్లీ ఏర్పాటు కావాలి. అది షెడ్యూల్ ప్రకారం జరిగితే సంగతి. కానీ కేంద్రం జమిలి యోచన చేస్తే.. తెలంగాణ ఎన్నికలు మరో ఆర్నెళ్లు వాయిదా పడి.. లోక్ సభతో పాటు ఏప్రిల్, మే లో జరగొచ్చు. అప్పుడు తెలంగాణ ఎన్నికలకు కూడా ఏపీ ఎన్నికల్లాగే 8 నెలల సమయం ఉంటుంది. ఏపీలో మొదట్నుంచీ ఏప్రిల్, మే ఎన్నికల అంచనాతో వ్యూహాలు ఉంటాయి. అక్కడ పెద్దగా పరిస్థితులు మారకపోవచ్చు. కానీ తెలంగాణలో రాజకీయ పార్టీలు ఇప్పటికే ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయాయి. బీఆర్ఎస్ నాలుగు స్థానాలకు మినహా మిగతా అసెంబ్లీ సీట్లకు అభ్యర్థుల్ని ఖరారు చేసింది. కాంగ్రెస్, బీజేపీ కూడా అభ్యర్థుల ఎంపికలో తలమునకలయ్యాయి. మరో రెండు నెలల్లో ఎన్నికలు వస్తాయని శరవేగంగా వ్యూహరచన చేస్తున్న పార్టీలకు.. ఇప్పుడు ఇంకా 8 నెలలు ఇదే టెంపో కంటిన్యూ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. బీఆర్ఎస్ అప్పుడే అభ్యర్థుల్ని ఖరారు చేసింది. మరి మరో 8 నెలల వరకు క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇలాగే ఉంటాయా.. లేక మారతాయా అనేది చూసుకోవాలి. కాంగ్రెస్ మరింత బలపడే అవకాశం లేకపోలేదనే వాదన కూడా ఉంది. ఇప్పుడు చేసిన వ్యూహరచనకు పెద్దగా మార్పులు చేయకపోయినా.. కొన్ని మార్పులైతే తప్పేలా లేవు. ఆ మార్పులు ఏంటి.. అవి ఎలా ఉంటాయనేది రాబోయో రోజుల్లో తెలుస్తుంది.
ఇప్పుడు అన్ని పార్టీల దృష్టి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపైనే ఉంది. ఆ సెషన్లో కచ్చితంగా జమిలిపై క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయనేది పార్టీల యోచన. జమిలి జరిగితే ఏపీకి సమస్య లేదు. కానీ తెలంగాణలో ప్రభుత్వ గడువు పొడిగించాలి. అప్పుడు ఆపద్ధర్మ ప్రభుత్వం కొనసాగిస్తారా.. రాష్ట్రపతి పాలన పెడతారా అనేది మరో ఆసక్తికరమైన ప్రశ్న. ఒకవేళ రాష్ట్రపతి పాలన పెడితే.. పరిస్థితులు మారతాయనే వాదన లేకపోలేదు. అదే సమయంలో ఆపద్ధర్మ ప్రభుత్వం ఉన్నా.. గవర్నర్ మరింత క్రియాశీలకం కావచ్చనే అంచనాలూ ఉన్నాయి. ఈ అవకాశాలను కూడా దృష్టిలో పెట్టుకుని రాజకీయ పార్టీలు రెడీ అవుతున్నాయి. ఏం చేసినా తమ ఎన్నికల వ్యూహానికి ఇబ్బంది లేకుండా జాగ్రత్తపడుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ నాటికి వ్యూహరచన పూర్తి చేసి ప్రచారంలోకి వెళ్లిపోతే.. ఆ తర్వాత ఏం జరిగినా ప్రచారానికి ఢోకా ఉండదనే లెక్కలో ఉన్నాయి.
ప్రస్తుతానికి అన్నీ అంచనాలే. ఏదీ క్లారిటీ లేదు. కానీ షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరగవేమోనని ఏదో అనుమానం. అందుకే పార్టీలు పైకి చెప్పకపోయినా.. అంతర్గతంగా వ్యూహరచన చేస్తున్నాయి. గుంభనంగా వ్యవహరిస్తున్నాయి. ఎందుకైనా మంచిదనే యాంగిల్లో ప్రిపేరవుతున్నాయి. కేంద్రం ఏదైనా చేయొచ్చనే లెక్కతో క్యాడర్ ను రెడీ చేస్తున్నాయి. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ చైతన్యం ఎక్కువ. ఇక్కడ పోలింగ్ బూత్ రాజకీయం కూడా భిన్నంగా ఉంటుంది. అందుకే కాస్త డిఫరెంట్ గా వ్యూహరచన చేయడం ఎలాగో ఇక్కడి పార్టీలకు బాగా తెలుసు. ఈ అడ్వాంటేజ్ ను ఉపయోగించుకుని రేసులో దూసుకెళ్లాలనే అంచనాలు వేసుకుంటున్నాయి పార్టీలు.
ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల్లో జాతీయ పార్టీలు బలంగా లేవు. అలాంటప్పుడు జమిలి పెట్టినా మారేదేం లేదనే వాదన ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ బలం పుంజుకున్నా.. జమిలికీ దానికీ సంబంధం లేదనే వాదన లేకపోలేదు. ఇలా రకరకాలుగా పరిస్థితుల్ని అంచనా వేసుకుంటున్న పార్టీలు.. అన్ని రకాలుగా యుద్ధాన్ని ఊహించుకుని ఆయుధాలు సమకూర్చుకుంటున్నాయి. ఎన్నికలు జమిలి అయినా.. షెడ్యూల్ ప్రకారం వచ్చినా.. ఎలాంటి అంశాలు తెరపైకి వచ్చినా.. ముందుగా అనుకున్నట్టే ఎలక్షన్ అజెండా సెట్ అయ్యేలా వ్యూహరచన చేస్తున్నాయి. అందుకే వీలైనంతగా జనంతో కనెక్షన్ పెంచుకుంటే ఏ పరిస్థితీ ఏమీ చేయలేదనే లెక్కలో ఉన్నాయి.