ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్, కెప్టెన్ బెన్ స్టోక్స్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. టెస్టు ఫార్మాట్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన క్రికెటర్‌గా హిస్టరీ క్రియేట్ చేశాడు. ఈ క్రమంలోనే గతంలో న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, ప్రస్తుతం ఇంగ్లాండ్ హెడ్‌కోచ్ బ్రెండన్ మెక్‌కలమ్ పేరిట ఉన్న రికార్డును స్టోక్స్ తిరగరాశాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ ద్వారా స్టోక్స్ ఆ రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో రెండు భారీ సిక్సర్లు కొట్టాడు స్టోక్స్. దీంతో మెక్‌కలమ్ పేరిట ఉన్న 107 సిక్సర్ల రికార్డును స్టోక్స్ అధిగమించేశాడు. కాగా స్టోక్స్ ఇప్పటివరకు 90 మ్యాచుల్లో 108 సిక్స్‌లు కొట్టాడు. ఆడమ్ గిల్ క్రిస్ట్ (100), క్రిస్ గేల్(98), జాక్వెస్ కలిస్ (97) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. కాగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 19 పరుగులు చేసిన స్టోక్స్.. రెండో ఇన్నింగ్స్‌లో 31 పరుగులు చేశాడు.
విజయం దిశగా ఇంగ్లాండ్
న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్ విజయం వైపుగా సాగుతోంది. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 73.5 ఓవర్లలో 374 రన్స్‌కు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని ఇంగ్లాండ్‌కు 394 లీడ్ లభించింది. అనంతరం భారీ టార్గెట్ ఛేజింగ్‌లో బరిలో దిగిన న్యూజిలాండ్ మూడో రోజు పూర్తిగా తడబడుతోండి. స్టువర్ట్ బ్రాడ్ విజృంభించడంతో 28 రన్స్‌కే ఐదు వికెట్లు కోల్పోయింది. లాథమ్ (15), కాన్వే (2), విలియమ్సన్ (0), నికోలస్ (7), బ్లండెల్ (9) పూర్తిగా విఫలమయ్యారు. ప్రస్తుతం 5 వికెట్ల నష్టానికి 39 రన్స్‌తో కివీస్ బ్యాటింగ్ చేస్తోంది. డారైల్ మిచెల్ (5 బ్యాటింగ్), బ్రేస్‌వెల్ (9 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. బ్రాడ్ 4 వికెట్లతో సత్తాచాటగా.. రాబిన్సన్ ఒక వికెట్ తీశాడు. ఇంకా 355 రన్స్ వెనుకంజలో ఉంది కివీస్.
Also Read: INDvsAUS 2nd Test: వార్నర్‌కు కాంకషన్.. రెండో టెస్టుకు దూరం!