Stock Market: ఈరోజు (శుక్రవారం) స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. ఇన్వెస్టర్ల సంపద ఒక్క రోజే రూ. 2 లక్షల కోట్లు పెరిగింది. సెన్సెక్స్ 467 పాయింట్లు, నిఫ్టీ 138 పాయింట్లు పెరిగాయి. ఇవాళ మార్కెట్లను ఏఏ అంశాలు ప్రభావితం చేశాయి, ఏఏ షేర్లు లాభాలను ఆర్జించాయో తెలుసుకుందాం. ఉదయం సెషన్ లో లాభాలతో ప్రారంభమైన సూచీలు ఇవాళ మొత్తం అదే జోరును కొనసాగించాయి. దీంతో మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్ ఈ సెన్సెక్స్ 467 పాయింట్లు పెరిగి 63,385 పాయింట్లకు చేరుకుంది. ఇక జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 138 పాయింట్లు వృద్ధి చెంది 18,826 వద్ద స్థిరపడింది.
Read Also: Infosys: “వర్క్ ఫ్రమ్ హోం”కి ఇన్ఫోసిస్ గుడ్ బై.. వారానికి 5 రోజులు ఆఫీస్ నుంచే పని..
ఇక ట్రేడింగ్ విషయానికొస్తే.. హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టైటాన్ కంపెనీ షేర్లు లాభాలను పొందాయి. మరోవైపు విప్రో, బజాజ్ ఆటో, టీసీఎస్, బీసీసీఎల్, ఓఎన్జీసీ షేర్లు నష్టాలను చవిచూశాయి. అంతేకాకుండా పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ ఒక్క శాతం పెరిగింది. క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ ఒక్క శాతం పెరిగింది. ఎఫ్ఎంసీజీ, హెల్త్ కేర్ సూచీ 0.5 శాతం పెరిగింది. ఐటీ సూచీ 0.38 శాతం క్షీణించింది. బీఎస్ ఈ మిడ్ క్యాప్ సూచీ, స్మాల్ క్యాప్ సూచీ 0.7 శాతం వృద్ధి నమోదు చేశాయి. దేశీయ మార్కెట్లు భారీ లాభాలను ఆర్జించడంతో ఇన్వెస్టర్ల సంపద ఒక్క రోజే రూ. 2 లక్షల కోట్లు పెరిగింది. దీంతో వారాంతంలో లాభాల పంట పండినట్లు అయింది. స్టాక్ మార్కెట్లో వచ్చే వారం కూడా ఇదే జోరు కొనసాగుతుందో లేదో చూడాలి.