Mulugu: ములుగు జిల్లా కేంద్రంగా నేడు కీలక కార్యక్రమం జరుగనుంది. రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖలు నేడు ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం కోసం మంత్రులు ములుగు జిల్లా వెంకటాపూర్ మండలాన్ని సందర్శించనున్నారు. శుక్రవారం ఉదయం 08:30 గంటలకు మంత్రులు బేగంపేట్ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి, 09:15 గంటలకు ములుగు జిల్లా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వద్ద హెలిపాడ్‌కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి మంత్రులు వెంకటాపూర్ మండలంలోని పివిసి కన్వెన్షన్ హాల్ కు చేరుకొని, 10:00 గంటలకు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు.
భూభారతి చట్టం పైలట్ ప్రాజెక్ట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ముఖ్యమైన భూముల రికార్డు నిర్వహణ పథకం. దీనివల్ల భూముల నమోదు, పునఃపరిశీలన, పౌరుల హక్కుల పరిరక్షణ లాంటి అంశాల్లో పారదర్శకత పెరుగనుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు పాల్గొని ప్రాజెక్ట్‌కు శ్రీకారం చేపట్టనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం మంత్రులు 12:00 గంటలకు ములుగు డిగ్రీ కాలేజీకి తిరిగి బయలుదేరి, 12:30 గంటలకు హెలిపాడ్‌కి చేరుకుంటారు. అక్కడి నుండి హెలికాప్టర్‌లో బయలుదేరి ఆదిలాబాద్ చేరుకోనున్నారు. ఈ పర్యటనతో ములుగు జిల్లాలో భూభారతి పైలట్ ప్రాజెక్ట్ అమలుకు మంచి ప్రోత్సాహం లభించనుంది. ప్రజలకు భూసంబంధిత సేవలు మరింత సమర్థవంతంగా అందించేందుకు ఇది ఒక కీలక దశగా పరిగణించవచ్చు.