Andhra Pradesh: ఏపీ సెక్రటేరియట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు(ఎస్‌ఐపీబీ) సమావేశం జరిగింది. స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు తొలి సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేష్, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, నారాయణ, అనగాని సత్యప్రసాద్, టీజీ భరత్, కందుల దుర్గేశ్, గొట్టిపాటి రవికుమార్,సుభాష్, బీసీ జనార్దన్ రెడ్డి, సీఎస్, పలుపురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఎస్ఐపీబీ తొలి సమావేశంలో 85,083 కోట్ల పెట్టుబడులకు మార్గం సుగమమైంది. రూ.85,053 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. నిరుద్యోగులకు 33,966 ఉద్యోగాల కల్పనకు అనుమతిస్తూ నిర్ణయం తీసకున్నారు. 10 కంపెనీలు పెట్టుబడులకు ముందుకు రాగా వాటిలో ప్రధానంగా ఆర్సిలర్ మిట్టల్ నిప్పన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూ.61,780 కోట్ల పెట్టుబడితో 2029 నాటికి 21 వేల మందికి ఉపాధి కల్పించనుంది. కల్యాణి స్ట్రాటెజీ సిస్టమ్స్ లిమిటెడ్ రూ.1,430 కోట్ల పెట్టుబడితో 565 మందికి ఉపాధి కల్పించనుంది. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూ.5,001 కోట్ల పెట్టుబడితో 1495 మందికి ఉపాధి లభించనుంది. టాఫే ఫరేషియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 76 కోట్ల పెట్టుబడితో 250 ఉద్యోగాలు లభించనున్నాయి.
Read Also: Purandeswari: వికలాంగ క్రీడాకారిణికి ధైర్యం నింపిన ఎంపీ పురంధేశ్వరి
ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ లిమిటెడ్ రూ3,798 కోట్ల పెట్టుబడితో 200 మందికి ఉపాధి లభించనుంది. ఆజాద్ ఇండియా మొబిలిటీ లిమిటెడ్ రూ.1,046 కోట్ల పెట్టుబడితో 2,381 మందికి ఉద్యోగాలు దొరకనున్నాయి. డల్లాస్ టెక్నాలజీ రూ.50 కోట్లు పెట్టుబడి పెడుతుండగా… 2వేల మందికి ఉపాధి కలగనుంది. గ్రీన్‌కో ఏపీ01 సోలార్ రూ.2వేల కోట్లు పెట్టుబడి పెడుతుండగా.. 1725 మందికి ఉపాధి లభించనుంది. ఆస్తా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా లిమిటెడ్ రూ.8,240 కోట్లు పెట్టుబడి(4వేల ఉద్యోగాలు), ఎకొరెన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూ.1,662 కోట్ల పెట్టబడితో 350 మందికి ఉపాధి కలగనుంది. ఉద్యోగాల సంఖ్య మేరకు,ఇటీవల ప్రకటించిన ఏపీ పారిశ్రామిక పాలసీకి అనుగుణంగా ప్రోత్సాహకాలు ఇవ్వాలని సమావేశంలో సీఎం చంద్రబాబు నిర్ణయించారు.