కాలేజీలో సీనియర్ల వేధింపులు.. దొంగతనం చేశావని చేసిన అవమానం.. మనస్థాపంతో యువతి ఆత్మహత్యాయత్నం.. 4 రోజులపాటు మృత్యువుతో పోరాడి చనిపోయిన కాకతీయ యూనివర్శిటీ విద్యార్థిని… మృతికి అరగంట ముందు ఇచ్చిన మరణ వాంగ్మూలతో పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు శ్రీవిద్య ఎందుకు ఆత్మహత్యా యత్నం చేసింది? ఆమె మృతికి కారణాలేంటి? యువతి పేరు శ్రీవిద్య. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడుకి చెందిన అంజమ్మ కూతురు. కాకాతీయ యూనివర్సిటీలో ఎంఎస్‌సీ.. ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీలో సెకండ్ ఇయర్ చదువుతోంది. అక్కడే యూనివర్సిటీలోని పద్మాక్షి హాస్టల్ బీ బ్లాక్‌లో ఉంటోంది.
అదే యూనివర్సిటీకి చెందిన పలువురు సీనియర్ విద్యార్థినిలతో మార్చి 5న శ్రీ విద్యకు వివాదం నెలకొంది. తమ వస్తువులు కొన్ని కనిపించకుండా పోయాయని.. అవి శ్రీవిద్యే తీసిందని ఆమెతో గొడవకు దిగారు సీనియర్లు. కానీ శ్రీవిద్య మాత్రం తాను అలాంటిది ఎక్కడా చేయలేదని.. ఎవరి వస్తువులు తీసుకెళ్లలేదని వారికి తేల్చి చెప్పింది. కానీ వాళ్లు పట్టించుకోకుండా పోలీసులకు చెబుతామని యూనివర్సిటీ క్యాంపస్‌లో స్టూడెంట్స్ అందరి ముందు ఆమెను బెదిరించారు. తమ వస్తువులు శ్రీవిద్యే దొంగతనం చేసిందని ఒప్పుకోవాలని ఒత్తిడి తెచ్చారు. కానీ శ్రీవిద్య ఒప్పుకోకపోవడంతో.. మూడు రోజుల పాటు హాస్టల్లోని ఓ గదిలో ఆమెపై విచక్షణా రహితంగా దాడి చేశారు. దీంతో శ్రీ విద్య తన తల్లికి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పింది.
వారు వచ్చి కాలేజీ నుంచి ఇంటికి తీసుకెళ్లారు. అక్కడి నుండి అమ్మమ్మ ఇంటికి తీసుకెళ్లారు. కానీ అక్కడ ఏం జరిగిందో ఏమో కానీ.. అప్పటికే తీవ్ర మనస్థాపంతో ఉన్న శ్రీవిద్య ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. శ్రీవిద్యకు వాంతులు కావడంతో ఆమె కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఐతే అక్కడ వైద్యులకు కానీ.. కుటుంబసభ్యులకు కానీ.. తాను ఆత్మహత్యాయత్నం చేసినట్లు చెప్పలేదు. దీంతో ఆమె పరిస్థితి సీరియస్‌గా మారింది. దీంతో వెంటనే హైదరాబాద్‌కు తరలించాలని వైద్యులు చెప్పడంతో నిమ్స్‌కు తరలించారు కుటుంబసభ్యులు.
కానీ నిమ్స్‌లోనూ ఆమె పరిస్థితి విషమంగానే మారింది. నాలుగు రోజులు మృత్యువుతో పోరాటం చేసి ఓడిపోయింది శ్రీవిద్య. చివరికి ప్రాణాలు విడిచింది. కాకతీయ యూనివర్సిటీకి చెందిన సీనియర్ విద్యార్థుల్లో ఆరుగురు విద్యార్థినులు తీవ్రంగా వేధింపులకు గురి చేయడంతోనే ఆత్మహత్యా యత్నం చేసిందని శ్రీవిద్య తల్లి అంజమ్మ అంటోంది. తన కూతురును ఛాతీ కింద రబ్బర్ బ్యాండ్లతో కొట్టిన దెబ్బలు, భుజం లేవకుండా కొట్టిన గాయాలు ఉన్నాయని.. మూడు రోజుల పాటు తన కూతురును గదిలో వేసి కొట్టారని అంజమ్మ చెబుతోంది.
Also Read:Swaasa : మీ దగ్గు విని వ్యాధిని చెప్పేస్తుంది.! ఈ కొత్త AI టెక్నాలజీ గురించి తెలుసా.?
మరోవైపు శ్రీవిద్య చనిపోయే కంటే అరగంట ముందుగా ఆమె మరణ వాంగ్మూలం రికార్డ్ చేశారు. ఆ వీడియోలో తనను సీనియర్లు వేధించిన తీరును వివరించింది శ్రీవిద్య. పలువురు సీనియర్ల పేర్లను వెల్లడించింది. నిమ్స్‌లో ప్రాణాలు వదిలిన శ్రీ విద్య… డెడ్‌బాడీకి గాంధీలో పోస్టుమార్టం పూర్తయిన తరువాత కుటుంబసభ్యులకు అప్పగించారు. శ్రీ విద్య డెడ్‌బాడీని తీసుకొని, అంత్య క్రియల కోసం స్వగ్రామానికి తీసుకెళ్లారు తల్లిదండ్రులు.
