NTV Telugu Site icon

Tirumala: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

Tirumala

Tirumala

Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్‌ 15 నుంచి 23 వరకు అంగరంగ వైభవంగా జరగనున్న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు శనివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. అంకురార్పణ సందర్భంగా సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహించారు. రేపటి నుంచి తొమ్మిది రోజుల పాటు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనుండగా.. రేపు ఉదయం బంగారు తిరుచ్చి పై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి.. రేపు రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహనంపై ఊరేగనున్నారు శ్రీవారు.

Also Read: Minister Kottu Satyanarayana: ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

ఇక ఇవాళ, రేపు తిరుపతిలో సర్వదర్శనం భక్తులకు జారీచేసే టోకెన్లు రద్దు చేసింది టీటీడీ.. మరోవైపు.. ఇవాళ నుంచి 23వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు, సిఫార్సు లేఖలపై జారీ చేసే వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు.. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 19వ తేదీన శ్రీవారికి గరుడ వాహన సేవ నిర్వహించనున్నారు.. షెడ్యూల్‌ సమయం కంటే అరగంట ముందుగానే గరుడ వాహన సేర నిర్వహించేలా అంటే.. సాయంత్రం 6:30 గంటలకే ప్రారంభం కానుంది గరుడ వాహన సేవ.. ఈ నేపథ్యంలో 19వ తేదీన ఘాట్ రోడ్లలో ద్విచక్రవాహనాలకు అనుమతి నిలిపివేయనున్నారు టీటీడీ అధికారులు. ఇక, తిరుమలలో భక్తుల రద్దీ పూర్తిగా తగ్గిపోయింది.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం చేసుకుంటున్నారు భక్తులు.. నిన్న శ్రీవారిని 59,304 మంది భక్తులు దర్శించుకోగా.. 22,391 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.08 కోట్లుగా ప్రకటించింది టీటీడీ.

కలియుగ వైకుంఠంగా తిరుమల ప్రసిద్ధి చెందిన సంగతి తెలిసిందే. శ్రీనివాసుడు వేంకటాద్రిపై వెలిసిన తొలినాళ్లలోనే బ్రహ్మదేవున్ని పిలిచి లోకకల్యాణం కోసం తనకు ఉత్సవాలు నిర్వహించాలని ఆజ్ఞాపించారని పురాణాల ప్రకారం తెలుస్తోంది. స్వామివారి ఆజ్ఞ ప్రకారమే శ్రీవేంకటేశ్వరుడు ఆనందనిలయం మధ్యలో ఆవిర్భవించిన కన్యామాసం(ఆశ్వయుజం)లోని శ్రవణా నక్షత్రం నాటికి పూర్తయ్యేలా బ్రహ్మదేవుడు తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలను నిర్వహించార‌ట‌. అందువల్లే ఇవి ‘బ్రహ్మోత్సవాలు’గా ప్రసిద్ధిచెందాయని అర్చకులు చెబుతూ ఉంటారు.