ENG vs SL: ప్రపంచకప్ 2023లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇంగ్లాండ్‌పై శ్రీలంక ఆటగాళ్లు విజృంభించారు. 25.4 ఓవర్లలోనే 8 వికెట్ల తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌పై భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ గెలుపుతో శ్రీలంక జట్టు రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ 33.2 ఓవర్లలో కేవలం 156 పరుగులకే ఆలౌటైంది.
శ్రీలంక బౌలర్లు అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో ఆంగ్ల జట్టును 156 పరుగులకే కట్టడి చేశారు. శ్రీలంక బౌలర్ల ధాటికి ఇంగ్లాండ్ కుప్పకూలిపోయింది. ప్రపంచకప్‌లో లంకేయులపై ఇంగ్లండ్‌కు ఇదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. ఇంగ్లీష్ ఓపెనర్లు నిలకడగా రాణించినప్పటికీ, వారిద్దరూ తమ ప్రారంభాలను పెద్ద స్కోర్లుగా మార్చడంలో విఫలమయ్యారు. జో రూట్ పెద్దగా ప్రభావం చూపడంలో విఫలమయ్యాడు. అలాగే జోస్ బట్లర్ పేలవమైన ఫామ్ కొనసాగుతుండగా.. జానీ బెయిర్‌స్టో రనౌట్ అయ్యాడు. బెన్ స్టోక్స్ 43 పరుగులతో వారి అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. అయితే అవతలి వైపు నుంచి బ్యాటర్ల మద్దతు లేకపోవడంతో అతను కూడా ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. చివరికి డిఫెండింగ్ ఛాంపియన్‌లు 156 పరుగులకే ఆలౌట్ అయ్యారు.
Also Read: ENG vs SL: శ్రీలంకతో కీలక మ్యాచ్.. 156 పరుగులకే ఇంగ్లాండ్ ఆలౌట్
అనంతరం లక్ష్యఛేదనకు దిగిన శ్రీలంక జట్టు 25.4 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది. పాతుమ్ నిస్సాంక(77), సదీర సమరవిక్రమ(65)ల మంచి బ్యాటింగ్‌తో లంక మరో రెండు పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది. ఈ ప్రపంచకప్‌లో శ్రీలంక ఈ భారీ విజయం ఖచ్చితంగా లంకేయులకు చాలా విశ్వాసాన్ని ఇస్తుంది. కుశాల్ పెరీరా ప్రారంభంలో ఇబ్బంది పడుతున్నట్లు కనిపించాడు. వెంటనే తక్కువ స్కోరుకే ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కుశాల్ మెండిస్ కొన్ని మంచి షాట్లు ఆడినప్పటికీ అతడిని కూడా పెవిలియన్‌కు పంపాడు. ఛేజ్ ఊహించిన దాని కంటే కొంచెం కష్టంగా అనిపించవచ్చు. పాతుమ్ నిస్సాంక, సదీర సమరవిక్రమ భాగస్వామ్యం లంకేయులను మళ్లీ ఆటలోకి తీసుకొచ్చింది. వారిద్దరూ తమ అర్ధ సెంచరీలను పూర్తి చేయగలిగారు. అనంతరం భారీ షాట్లు ఆడుతూ త్వరగానే లంకకు విజయాన్ని కట్టబెట్టారు.
ఈ మ్యాచ్‌లో శ్రీలంక బౌలర్ల దూకుడు ముందు ఇంగ్లాండ్ బ్యాటర్లు తేలిపోయారు. ఈ ఇన్నింగ్స్‌లో ఒక్కరంటే ఒక్కరు కూడా అర్ధ శతకం చేయలేకపోవడం గమనార్హం. ఇంగ్లాండ్ జట్టుకు షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే పసికూన అఫ్గాన్ చేతిలో ఓడిన ఇంగ్లాండ్ జట్టు.. తనకన్నా బలహీన శ్రీలంకపై చిత్తుగా ఓడి సెమీస్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. చెప్పాలంటే ఇంగ్లాండ్ సెమీస్ ఆశలు గల్లంతైనట్టే. ఇప్పటివరకు ఐదు మ్యాచులాడిన ఇంగ్లాండ్.. తాజా ఓటమితో నాలుగో ఓటమిని తన ఖాతాలో వేసుకుంది.