NTV Telugu Site icon

Tirumala: నేడు శ్రీవారి ఆలయంలో ప్రత్యేక సహస్ర కలశాభిషేకం

Tirumala

Tirumala

Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలోని శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి ఇవాళ ప్రత్యేక సహస్ర కలశాభిషేకం జరుగనుంది. గత 18 ఏళ్లుగా శ్రీవారి ఆలయంలో టీటీడీ ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఏడాదికి ఒక్కసారి స్వామివారికి సహస్రకలశాభిషేకాన్ని అర్చకులు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి 8.30 గంటల నడుమ శ్రీవారి ఆలయంలోని బంగారువాకిలి చెంత భోగ శ్రీనివాసమూర్తికి అర్చకస్వాములు ఏకాంతంగా సహస్ర కలశాభిషేకం నిర్వహిస్తారు. శ్రీవారి ఆలయంలోని ఆర్జిత సేవలన్నీ యథావిధిగా కొనసాగుతాయి.

చారిత్రక నేపథ్యం :
పల్లవ రాణి సామవాయి పెరుందేవి క్రీ.శ 614వ సంవత్సరంలో జ్యేష్ఠ మాసంలో 18 అంగుళాల పొడవుగల వెండి భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని తిరుమల శ్రీవారి ఆలయానికి కానుకగా సమర్పించారు. ఇందుకు గుర్తుగా ప్రతి సంవత్సరం ఆలయంలో శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి సహస్రకలశాభిషేకం నిర్వహిస్తారు. పల్లవరాణి కానుకకు సంబంధించిన ఈ శాసనం ఆలయ మొదటి ప్రాకారంలోని విమాన వేంకటేశ్వరుని విగ్రహం కింది భాగంలో గోడపైన కనిపిస్తుంది. ఆగమం ప్రకారం శ్రీవారి ఆలయంలోని పంచబేరాల్లో ఒకరైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తిని కౌతుకమూర్తి అని, శ్రీ మనవాళపెరుమాళ్‌ అని కూడా పిలుస్తారు.

మరోవైపు ఇవాళ టీటీడీ ఈవోగా శ్యామలరావు బాధ్యతలు అప్పగించనున్నారు. ఇదిలా ఉండగా.. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి వెలుపల క్యూ లైనులో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. నిన్న(శనివారం) శ్రీవారిని 82,886 మంది భక్తులు దర్శించుకున్నారు. 44, 234 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.09 కోట్లు వచ్చింది.

Show comments