కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌పై కేసు నమోదు చేయాలని పోలీసులకు ప్రత్యేక కోర్టు ఆదేశించింది. బీజేపీ నేతల నిరసన చిత్రాన్ని మార్ఫింగ్ చేసినందుకు డీకే శివకుమార్‌తో పాటు కాంగ్రెస్ రాష్ట్ర ఐటీసెల్ హెడ్ బీఆర్ నాయుడుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులను ప్రత్యేక కోర్టు ఆదేశించింది.
1992లో బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో ఆందోళనలో పాల్గొన్న కరసేవక్ శ్రీకాంత్ పూజారిని పోలీసులు ఇటీవల అరెస్టు చేసినందుకు వ్యతిరేకంగా కమలనాథులు నిరసన చేపట్టారు. ఇందులో భాగంగా ఆందోళనకారులు ‘నేను కూడా కరసేవక్‌నే.. నన్ను కూడా అరెస్టు చేయండి’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.
అయితే ఈ ప్లకార్డులను కాంగ్రెస్ మరో రకంగా మార్చి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మోసాలు, ఇతర అక్రమాలు మేమే చేశాం అనే అర్థం వచ్చేలా మార్ఫింగ్ చేసి కాంగ్రెస్ ఐటీ సెల్ పోస్ట్ చేసింది. ఇదే పోస్టులను డీకే.శివకుమార్ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
కాంగ్రెస్ రాసిన రాతలపై కాషాయ పార్టీ నేతలు గరం గరం అయ్యారు. బీజేపీ నాయకులను అవమానపరిచేలా దీనిని కాంగ్రెస్ నేతలు మార్చారని పేర్కొంటూ బీజేపీ లీగల్ సెల్ ప్రత్యేక కోర్టులో ఫిర్యాదు చేసింది. దీంతో చిత్రాన్ని మార్ఫింగ్ చేసినవారిపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది.
ఇదిలా ఉంటే కర్ణాటక రాష్ట్రం పట్ల కేంద్రం అన్యాయం చేస్తోదంటూ ఢిల్లీ వేదికగా జంతర్‌మంతర్ దగ్గర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ ఆధ్వర్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. కేంద్రం తీరుకు నిరసనగా ప్లకార్డులు ప్రదర్శించారు. మరోవైపు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీజేపీ కూడా ఢిల్లీ, కర్ణాటకలో నిరసనలు చేపట్టారు. ఇలా రెండు జాతీయ పార్టీల నేతలు బుధవారం కర్ణాటక రాజకీయాలను హీటెక్కించారు.