Ranjith Reddy: నా తల్లిదండ్రులు, భార్య, పిల్లల మీద ఓట్టేసి చెబుతున్న.. నేను రంజిత్ రెడ్డి అన్న గెలుపు కోసం కృషి చేస్తాను అని స్పష్టం చేశారు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.. లోక్‌సభ ఎన్నికల్లో చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన రంజిత్‌రెడ్డి.. విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.. మరోవైపు.. సభలు, సమావేశాలతో పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు.. ఇక, ఈ రోజు వికారాబాద్ బూత్ కార్యకర్తల సమావేశంలో.. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌తో పాటు వేం నరేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి, రాంమోహన రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ లీడర్లు.. పెద్ద ఎత్తున్న పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి.. ఇక, ఈ సమావేశంలో.. స్పీకర్ గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ.. తన తల్లిదండ్రులు, భార్య, పిల్లల మీద ఓట్టేసి చెబుతున్నా.. తాను చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ జి. రంజిత్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తానని తెలిపారు.
తాను రంజిత్ రెడ్డి గెలుపు కోసం ఈ ఎన్నికల్లో గట్టిగా పని చేస్తానని వెల్లడించారు తెలంగాణ శాసనసభ స్పీకర్, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్. తమ క్యాడర్ కుడా శషబిషలు పక్కనబెట్టి పని చేస్తుందని తెలిపారు. కార్యకర్తల్లో ఏమైనా చిన్న చిన్న స్పర్థలు ఉంటే పక్కన బెట్టాలని సూచించారు. కాంగ్రెస్ హైకమాండ్, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు పాటించి రంజిత్ రెడ్డి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. వికారాబాద్ కాంగ్రెస్ బూత్ కార్యకర్తల సమావేశం ఈ రోజు స్థానికంగా నిర్వహించారు.. ఈ సమావేశంలో చేవెళ్ళ పార్లమెంట్ ఇంఛార్జీ వేం నరేందర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు, పరిగి ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి, అభ్యర్థి డాక్టర్ జి. రంజిత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ…. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు పట్టుకొమ్మలని చెప్పారు. పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయానికి కీలకపాత్ర బూత్ స్థాయి కార్యకర్తలని చెప్పారు. ఈ ఎన్నికలలో ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైన్యంలో పని చేస్తున్నట్టు వ్యవహరించాలన్నారు. కార్యకర్తలు గడపగడపకు తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. రాష్ట్రంలో రేవంత రెడ్డి ప్రభుత్వం ప్రత్యేకంగా మహిళల సంక్షేమ కోసం పెద్దపీఠ వేసిందన్నారు. రైతులకు రుణమాఫీ, మిగిలిన గ్యారెంటీలను అమలు చేస్తామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్ రెడ్డి, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కో ఆప్షన్ సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
మరోవైపు ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా బీజేపీ మత రాజకీయాలు చేస్తుందని.. కాంగ్రెస్ మాత్రం సంక్షేమ రాజకీయం చేస్తున్నదన్నారు. పేదల కడుపు నింపాలని కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంటే.. బీజేపీ విభజన రాజకీయాలు చేస్తూ కల్లోలం సృష్టించాలని యత్నిస్తుందని విమర్శించారు. బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి నాలుగేండ్లు ఇంట్లో పడుకొని.. ఇప్పుడొచ్చి తాను ఏదో చేస్తున్నాని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. తాను మాత్రం ఐదేళ్లు ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉన్నానని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తే అర్హులైన ప్రతి ఇంటికి తాను ఆరు గ్యారంటీలు తీసుకువస్తానని హామీ ఇచ్చారు రంజిత్‌రెడ్డి.