నైరుతి రుతుపవనాలు కేరళతో పాటు గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్‌లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. రాగల మరికొద్ది గంటల్లో రాయలసీమను నైరుతి రుతుపవనాలు తాకనున్నాయి. వారం రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. దాంతో రానున్న మూడు రోజుల పాటు ఏపీలో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఇప్పటికే ఉత్తర కోస్తా జిల్లాల్లో వానలు, ఈదురు గాలులు కొనసాగుతున్నాయి. వారం రోజుల ముందుగానే ఏపీకి రుతుపవనాలు వస్తున్నాయి.
Also Read: Kakani Govardhan Reddy: పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.. వైసీపీ నేతల హెచ్చరిక!
మహారాష్ట్రలోని రత్నగిరి సమీపంలో శనివారం తీరం దాటిన వాయుగుండం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది. ప్రస్తుతం మహారాష్ట్ర, కర్ణాటక పరిసరాల్లో కొనసాగుతోన్న అల్పపీడనం.. క్రమంగా తూర్పు దిశగా పయనించి ఈరోజటికి మరింత బలహీన పడుతుందని ఐఎండీ పేర్కొంది. అరేబియా సముద్రం నుంచి మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ మీదుగా.. ఒడిశా వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇక మంగళవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది.