గుడ్ న్యూస్ చెప్పింది భారత వాతావరణ కేంద్రం(ఐఎండీ). భారత వ్యవసాయాధారిత ఆర్థిక వ్యవస్థకు వెన్నుముఖగా భావించే నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి. సాధారణం కన్నా మూడు రోజుల ముందే మే 29న కేంద్రంలోకి ప్రవేశించాయని ఐఎండీ వెల్లడించింది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 1న కేరళ తీరాన్ని తాకుతాయి. అయితే ఈ సారి అనుకూల పరిస్థితులు ఏర్పడటంతో మూడు రోజులు ముందుగానే నైరుతి రుతుపవనాలు కేరళ రాష్ట్రంలోకి వ్యాపించాయి.
అయితే అంతకుముందు బంగాళా ఖాతంలో అసనీ తుఫాన్ కారణంగా మే 27నే రుతుపవనాలు కేరళలోకి వస్తాయని ఐఎండీ అంచనా వేసింది. అయితే అంచనా వేసిన దాని కన్నా రెండు రోజులు ఆలస్యంగా నైరుతి ఎంట్రీ ఇచ్చింది. దీంతో కేరళలో చిరుజల్లులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అక్కడక్కడ జల్లులు పడుతున్నాయి.
ఢిల్లీలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. రానున్న రెండు మూడు రోజుల్లో కర్ణాటకలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని కర్ణాటక వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న 48 గంటల్లో తెలంగాణలో తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు కురువనున్నాయి. జూన్ 5 నుంచి 10 వరకు తెలంగాణ వ్యాప్తంగా రుతుపవనాలు వ్యాపించి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. జూన్ చివరి వారం నాటికల్లా దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించనున్నాయి.
ఈ సారి దేశంలో సాధారణ వర్షపాతం నమోద అవుతుందని ఐఎండీ వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు వ్యవసాయంతో జూదం వంటివి అని అంటుంటారు. అంతగా దేశంలోని వ్యవసాయం, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంటాయి నైరుతి రుతుపవనాలు. గతేడాది లానినో ప్రభావంతో భారీగా వర్షాలు కురిశాయి. నైరుతి రుతుపవనాలపై ఎల్ నినో, లానినో అనే రెండు వ్యవస్థలు ప్రభావం చూపిస్తాయి. ఎల్ నినో ఏర్పడిన ఏడాది నైరుతి రుతుపవనాల ద్వారా తక్కువ వర్షాలు కురుస్తాయి. లానిలో వల్ల ఎక్కువ వర్షాలు కురుస్తాయి.