South Indian Heros: ఒకప్పుడు బాలీవుడ్ దర్శకుడితో సినిమా అంటే పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొనేవి. కానీ ఇప్పుడు భారతీయ సినీ పరిశ్రమలో సీన్ పూర్తిగా మారిపోతోంది. మన స్టార్ హీరోలు హిందీ మేకర్స్ కంటే తెలుగు, తమిళ, మలయాళ దర్శకులతో ప్రాజెక్టులు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. ఇది బాలీవుడ్ నెమ్మదిగా పట్టు కోల్పోవడానికి సంకేతమా లేక సౌత్ దర్శకుల కంటెంట్, మార్కెట్ భారీగా పెంచుకోవడానికి నిదర్శనమా అనే చర్చ మొదలైంది.
ఇందులో మొదటగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘జంజీర్’ పరాజయం తర్వాత బాలీవుడ్ దర్శకుల వైపు కన్నెత్తి కూడా చూడట్లేదు. ఆయన సుకుమార్‌తో ప్రాజెక్టును సిద్ధం చేసుకుంటూనే, తర్వాతి సినిమాలను కూడా స్థానిక దర్శకులతోనే ప్లాన్ చేస్తున్నారు. హిందీ మార్కెట్లోకి వెళ్లాల్సి వచ్చినా మన నేటివిటీ, మన దర్శకుల సినిమాల ద్వారానే పాన్ ఇండియా స్థాయిలో వెళ్లాలన్నది చరణ్ వ్యూహంగా కనిపిస్తోంది.
మరోవైపు ‘వార్ 2’ అనుభవం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ దర్శకులకు ఆమడ దూరంలో ఉంటున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఆ సినిమా అనుభవాలు తారక్ ఆలోచనల్లో బాగా మార్పు తెచ్చినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ చేస్తుండగా.. ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘గాడ్ ఆఫ్ వార్’ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఎన్టీఆర్ పూర్తి దృష్టి సౌత్ దర్శకులపైనే కేంద్రీకృతమై ఉంది.
కేవలం వీరిద్దరూ మాత్రమే కాదు.. ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్ ఇంకా అనేక సౌత్ ఇండియా సూపర్ స్టార్లు టాప్ స్టార్స్ లైనప్ గమనిస్తే అంతా సౌత్ దర్శకుల పేర్లే ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇక్కడ మరో విచిత్రమేమిటంటే.. మన హీరోలు బాలీవుడ్ మేకర్స్‌ను దూరం పెడుతుంటే, సౌత్ దర్శకులు మాత్రం బాలీవుడ్ హీరోలను డైరెక్ట్ చేస్తూ తమ మార్కెట్‌ను దేశవ్యాప్తంగా పెంచుకుంటున్నారు. కంటెంట్, ఎమోషన్, లార్జర్ ద్యాన్ లైఫ్ ఎలిమెంట్స్‌ను ప్రజెంట్ చేయడంలో మన దర్శకులే మేటి అని తేలిపోవడంతో, సౌత్ హీరోలు ఇక హిందీ దర్శకులను గుడ్డిగా నమ్మే స్థితిలో లేరు.

