Site icon NTV Telugu

T20 World Cup 2024: భారత్ భయం లేకుండా ఆడాలి.. ఓపెనర్లుగా వారిద్దరే కరెక్ట్: దాదా

Sourav Ganguly about T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌ 2024లో భారత్ ఎలాంటి భయం లేకుండా ఆడాల్సిన అవసరం ఉందని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నారు. ప్రపంచకప్‌ కోసం జట్టు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్లేయర్లను ఎంపిక చేయాల్సిన బాధ్యత బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ, కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, కెప్టెన్‌ రోహిత్‌ శర్మపై ఉందన్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్‌ కలిసి ఓపెనింగ్‌కు దిగితే బాగుంటుందని తాను భావిస్తున్నానని దాదా పేర్కొన్నారు. ఐపీఎల్ 2024 అనంతరం జూన్‌ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్‌లో పొట్టి టోర్నీ జరగనున్న విషయం తెలిసిందే.

సోమవారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ… ‘టీ20 ప్రపంచకప్‌ 2024కు జట్టు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్లేయర్లను ఎంపిక చేయాల్సిన బాధ్యత బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ, కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, కెప్టెన్‌ రోహిత్‌ శర్మపై ఉంది. మెగా టోర్నీలో రోహిత్‌తో కలిసి విరాట్ కోహ్లీ ఓపెనింగ్‌కు దిగితే బాగుంటుంది. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. సెలెక్టర్లు కచ్చితంగా ఇలాగే చేయాలని నేను సూచించడం లేదు. తుది నిర్ణయం బీసీసీఐ సెలెక్టర్లదే. ప్రపంచకప్‌లో భారత్ ఎలాంటి భయం లేకుండా ఆడాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు.

Also Read: Mumbai Indians Playoffs: పట్టికలో ఏడో స్థానం.. ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ చేరాలంటే?

‘టీ20ల్లో ఆటగాళ్ల వయసుకు ఓ నిర్దిష్ట నియమం లేదు. 41 ఏళ్ల జేమ్స్‌ ఆండర్సన్‌ ఇంకా టెస్టులు ఆడుతున్నాడు. అతడు 30-35 ఓవర్లు బౌలింగ్‌ వేస్తున్నాడు. 40 ఏళ్ల ఎంఎస్ ధోనీ ఇంకా భారీ సిక్సర్లు బాదుతున్నాడు. మ్యాచులో బౌండరీలు కొట్టడం ముఖ్యం. 40 బంతుల్లో సెంచరీ చేయగల సత్తా విరాట్ కోహ్లీకి ఉంది. టీ20 ప్రపంచకప్‌ 2024లో టీమిండియా హిట్టింగ్‌పై దృష్టి సారించాలి. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, శివమ్‌ దూబే, హార్దిక్‌ పాండ్యా, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా .. ఇలా చాలా మంది అద్భుతమైన ఆటగాళ్లున్నారు. బౌండరీలు బాదడంలో వారి నైపుణ్యం అద్భుతం’ అని దాదా చెప్పుకొచ్చారు.

Exit mobile version