NTV Telugu Site icon

Bihar political crisis: రంగంలోకి సోనియాగాంధీ.. నితీష్‌కు ఫోన్ చేస్తే రిప్లై ఇలా..!?

Sonia

Sonia

బీహార్‌లో చోటుచేసుకున్న రాజకీయ సంక్షోభంతో ఇండియా కూటమి అలర్ట్ అయ్యింది. కూటమిలో కీలక నేతగా ఉన్న నితీష్‌కుమార్ దాదాపు బయటకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్, ఆప్ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించాయి. తాజాగా జేడీయూ కూడా తెగతెంపులు చేసుకునేందుకు సన్నద్ధమైంది. ఈ అనిశ్చితి ఇలానే కొనసాగితే ఇండియా కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లే. మరోవైపు లోక్‌సభ ఎన్నికల ముందు ఇండియా కూటమిలో తలెత్తిన ఈ సంక్షోభం బీజేపీ క్యాష్ చేసుకునే పనిలో పడింది. దీంతో కమలం పార్టీకి ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకూడదన్న నేపథ్యంలో సోనియాగాంధీ రంగంలోకి దిగారు.

Read Also: Bihar Crisis: అమిషా ఇంట్లో కమలనాథుల కీలక భేటీ.. ఏం చర్చించారంటే..!

రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో న్యాయ యాత్ర ఈ నెల 30న బిహార్‌లో ప్రవేశించనుంది. ఈ యాత్రలో పాల్గొనవల్సిందిగా ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ను కాంగ్రెస్ ఆహ్వానించింది. ఇదే విషయాన్ని గుర్తుచేసేందుకు నితీష్‌కుమార్‌కు సోనియాగాంధీ ఫోన్ చేశారని సమాచారం. కానీ ఆమెతో మాట్లాడేందుకు ముఖ్యమంత్రి విముఖతను వ్యక్తం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సోనియా చేసిన ఫోన్‌ను లిఫ్ట్ చేయడానికి నితీష్ అయిష్టతో చూపినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ఉద్దేశపూర్వకంగానే సోనియాను నితీష్ పట్టించుకోలేదని తెలిపాయి. రాహుల్ గాంధీ యాత్రలో పాల్గొనడం ఇష్టం లేకనే నితీష్ ఈ పని చేసినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో బీహార్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమన్న ఊహాగానాలకు బలం చేకూరింది. వాస్తవానికి ఇండియా కూటమి ఏర్పాటుకు నితీష్‌కుమార్ కీలక పాత్ర పోషించారు. కానీ కూటమి అధ్యక్షుడిగా తనను కాకుండా మల్లిఖార్జున ఖర్గేను ఎంచుకోవడంపై నితీష్ అలకబూనినట్లు తెలుస్తోంది. మొత్తానికి మరికొద్ది రోజుల్లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల ముందు ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయో వేచిచూడాలి.